Flight Emergency Landing: టాటా గ్రూప్ నడిపిస్తున్న ఎయిర్ఇండియా విమానం గురువారం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ముంబయి నుంచి బెంగళూరు పయనమైన A320NEO విమానం.. టేకాఫ్ అయిన 27 నిమిషాలకే తిరిగి ముంబయి విమానాశ్రయానికి చేరుకుంది. గాల్లో ఉండగానే ఓ ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియాకు చెందిన A320NEO విమానాలు సీఎఫ్ఎమ్ లీప్ ఇంజిన్లు కలిగి ఉంటాయి. అయితే వాటిలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు.
ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9.43 గంటలకు A320NEO విమానం బయలుదేరింది. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ పనిచేయడం ఆగిపోయిందని గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ వెంటనే 10.10 గంటలకు ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.