తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మూత్ర విసర్జన చేసింది నేను కాదు.. ఆమెనే!'.. ఎయిర్ ఇండియా కేసులో కొత్త ట్విస్ట్​

Air India Peeing Incident : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎయిర్​ ఇండియా కేసు కీలక మలుపు తిరిగింది. మహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదని.. ఆ మహిళే మూత్ర విసర్జన చేసుకుందని కోర్టుకు చెప్పారు నిందితుడు శంకర్ మిశ్రా.

Air India Peeing Incident
Air India Peeing Incident

By

Published : Jan 13, 2023, 4:14 PM IST

Updated : Jan 13, 2023, 5:51 PM IST

Air India Peeing Incident : ఎయిర్​ ఇండియాలో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరో మలుపు తిరిగింది. ఘటన అనంతరం మొదటిసారిగా మాట్లాడిన నిందితుడు శంకర్​ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదని.. ఆ మహిళే మూత్ర విసర్జన చేసుకుందని చెప్పారు. నిందితుడ్ని పోలీస్ కస్టడీకి అప్పగించడంపై మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్ తీర్పును సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై దిల్లీ అడిషనల్ సెషన్స్​ కోర్టులో విచారణ సందర్భంగా శంకర్ తరఫు న్యాయవాది ఈమేరకు జడ్జికి తెలిపారు.

"నేను నిందితుడిని కాను. ఆమెపై నేను మూత్ర విసర్జన చేయలేదు. ఆ మహిళ తనపై తానే.. మూత్ర విసర్జన చేసుకున్నారు. ఆమె ప్రొస్టేట్​ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె కూర్చున్న సీటు దగ్గరకు ఎవరూ వెళ్లడానికి అవకాశం లేకుండా ఉంది. కేవలం వెనుక నుంచి వెళ్తేనే ఆమె వద్దకు వెళ్లే అవకాశం ఉంది. వెనుక నుంచి మూత్ర విసర్జన చేస్తే ఆమెపై పడదు. ఆమె వెనుక కూర్చున్న ప్రయాణికుడు సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. "

--శంకర్ మిశ్రా, నిందితుడు

పోలీసులు, మీడియా కలిపి ఈ కేసును జోక్​గా మార్చారని నిందితుడు మిశ్రా తరఫు న్యాయవాది రమేశ్ గుప్తా కోర్టులో ఆరోపించారు. " ఘటన జరిగిన తర్వాత రోజు నగదు రీఫండ్​ చేయాలని ఆమె కోరగా.. ఎయిర్​ లైన్​ ఇచ్చింది. కానీ పోలీసులు, మీడియా కలిపి దీనిని జోక్​గా మార్చారు. ఇది అంత పెద్ద కేసా? ఇదేమైనా మర్డర్ కేసా? బెంగళూరు వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. అతడి ఉద్యోగం కూడా పోయింది." అని రమేశ్ కోర్టుకు చెప్పారు.

మరిన్ని సాక్ష్యాలను సేకరించేందుకు నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోరింది పోలీసు శాఖ. "విమానం ఎక్కేముందు ఏదైనా సేవించాడా? మద్యాన్ని అతడు ఎక్కడ దాచాడు? విచారణకు ఎందుకు హాజరు కాలేదు? ఫోన్​ ఎందుక స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలు అడగాల్సి ఉంది" అని కోర్టుకు తెలిపింది. తాము సాధారణంగానే విచారిస్తామని థర్డ్ డిగ్రీ ప్రయోగించబోమని కోర్టుకు స్పష్టం చేసింది. పోలీసు శాఖ విజ్ఞప్తిపై స్పందించిన కోర్టు.. ఇప్పుడు ప్రస్తావించిన విషయాలు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్​కు ఎందుకు నివేదించలేదని ప్రశ్నించింది. పోలీసుల పిటిషన్​ను కొట్టివేసింది. దీనిపై మరిన్ని వివరాలతో తిరిగి మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్ కోర్టుకే వెళ్లాలని సూచించింది.

నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిర్​ ఇండియా విమానం బిజినెస్‌ క్లాసులో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితుడు శంకర్‌ మిశ్రాను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అతడిని మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని దిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. శంకర్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని.. అప్పుడే విమాన కెప్టెన్‌, క్యాబిన్‌ సిబ్బంది అతడిని గుర్తుపడతారని పోలీసులు తెలిపారు. నిందితుడికి పోలీసు కస్టడీకి అప్పగించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం అతడికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించింది.

టాటా గ్రూప్ ఛైర్మన్ విచారం
టాటా గ్రూప్​ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్ సైతం విసర్జన ఘటనపై​ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమ ఉద్యోగులు త్వరితగతిన స్పందించాల్సిందని చెప్పారు. దీనికి వారు సరైన రీతిలో పరిష్కారం చూపించలేదని తెలిపారు. ఈ ఘటన తనతో పాటు సంస్థ ఉద్యోగులకు ఎంతో వేదనను కలిగించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు టాటా గ్రూప్, ఎయిర్​ ఇండియా సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయని.. తమ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తారని ఆయన వివరించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూత్ర విసర్జన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్​ ఇండియా విమానయాన సంస్థకు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఇవీ చదవండి:విమానంలో మహిళపై మూత్రం కేసులో ఎయిర్ ​ఇండియాకు చిక్కులు

'వారు వేగంగా స్పందిస్తే బాగుండేది'.. మూత్ర విసర్జన ఘటనపై టాటా గ్రూప్ ఛైర్మన్

Last Updated : Jan 13, 2023, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details