Air India Pee Incident : ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనపై టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమ ఉద్యోగులు త్వరితగతిన స్పందించాల్సిందని చెప్పారు. దీనికి వారు సరైన రీతిలో పరిష్కారం చూపించలేదని తెలిపారు. ఈ ఘటన తనతో పాటు సంస్థ ఉద్యోగులకు ఎంతో వేదనను కలిగించిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయని.. తమ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తారని ఆయన వివరించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూత్ర విసర్జన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిరిండియా విమానయాన సంస్థకు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
'బాధితురాలికి సీటు కూడా ఇవ్వలేదు'
మహిళపై మూత్ర విసర్జన జరగలేదంటూ నిందితుడి తండ్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు అమెరికాకు చెందిన సహ ప్రయాణికుడు డాక్టర్ సుగతా భట్టాచార్జీ. ఇంత వివాదం నడుస్తున్న తరుణంలో.. తన కుమారుడు అమాయకుడని చెప్పడం దారుణమని అన్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉండి ఏం చేస్తున్నాడో కూడా తెలియదని వివరించారు. విమాన సిబ్బంది ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. బాధితురాలికి సరైన సీటు కూడా కేటాయించలేదని విమర్శించారు. ఇంతకాలం తాను వేచి ఉన్నానని.. కానీ అతడి తండ్రి ఇలా చెప్పాక తాను నిశబ్దంగా ఉండడం సరైంది కాదన్నారు. అందుకే నైతిక బాధ్యతగా ఆ మహిళకు అండగా తాను ఫిర్యాదు చేస్తున్నానని తెలిపారు. ఓ మహిళ పరువుతో పాటు టాటా లాంటి గొప్ప సంస్థ పేరును సైతం చెడగొట్టాడని విమర్శించారు. అతడు సైతం తన ఉద్యోగాన్ని కోల్పోయాడని.. అతడి కుటుంబం కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందన్నారు.
'పైలట్లపై వేటు వేయడం సరైంది కాదు'
ఈ ఘటనలో బాధిత మహిళ పట్ల విమాన సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పందించిన ఎయిర్ ఇండియా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఘటన సమయంలో ఉన్న విమాన పైలట్, క్యాబిన్ సిబ్బందిపై వేటు వేసింది. అయితే ఈ ఘటనపై మాజీ పైలట్లు తీవ్రంగా విమర్శించారు. ఐదుగురిపై చర్యలు తీసుకోవడానికి సరైన కారణం లేదని చెప్పారు.