అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వల్ల ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఎయిరిండియా విమానం.. 129 ప్రయాణికులతో తిరిగి దిల్లీకి చేరుకుంది. దిల్లీ నుంచి 40 మంది ప్రయాణికులతో సురక్షితంగా కాబూల్ వెళ్లిన విమానం.. తిరిగి ప్రయాణంలో టేకాఫ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది.
ఎయిరిండియా విమానంపై ఉత్కంఠ..
దిల్లీ నుంచి కాబూల్‌కు ఆదివారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానం బయలుదేరిన సమయంలో అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికే కాబూల్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారనే ప్రకటన వెలుబడింది. అదే సమయంలో కాబూల్ ఎయిర్‌పోర్టులో విమానానికి అనుమతిచ్చేందుకు ఏటీసీ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తమైన ఎయిరిండియా పైలట్.. శత్రువులకు లక్ష్యంగా కాకుండా ఉండేందుకు విమాన రాడార్ వ్యవస్థను ఆఫ్ చేశారు. చివరకు గంట ఆలస్యంగా కాబూల్ ఎయిర్‌పోర్టులో విమానం దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ అదే విమానం 129 ప్రయాణికులతో దిల్లీకి చేరుకుంది.