షార్జాకు వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా జి9 - 426 విమానం సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో వెంటనే అప్రమత్తమైన కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు 45 నిమిషాల వ్యవధిలో పరిస్థితులు అన్నింటినీ చక్కదిద్దినట్లు ఎయిర్‌పోర్ట్ ఎండీ ఎస్.సుహాస్ తెలిపారు. ఇక్కడకు రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఎయిర్ అరేబియా విమానంలోని 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
విమానం దారి మళ్లింపు:విమానం ఇంజిన్ కంపించడం వల్ల దిల్లీ నుంచి వడోదరా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌ను జైపుర్‌కు అత్యవసరంగా దారి మళ్లించారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. విమానం ఇంజనులో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ దారి మళ్లింపు జరిగిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని డీజీసీఏ పేర్కొంది.