తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం కోసం హిమంత 'టాప్​-5' లక్ష్యం - అసోం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణం

అసోంను అభివృద్ధిలో దేశంలోని తొలి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు హిమంత బిశ్వ శర్మ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. హిమంతకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది మార్గంలో మరింత ముందుకు తీసుకెళుతుందనే విశ్వాసం ఉందన్నారు.

Himanta biswa sarma
హిమంత బిశ్వ శర్మ

By

Published : May 10, 2021, 4:38 PM IST

Updated : May 10, 2021, 4:44 PM IST

అసోం 15వ ముఖ్యమంత్రిగా.. ఈశాన్య రాష్ట్రాల ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్​, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ.. సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీమంత శంకర్​దేవ్​ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్​ జగదీశ్​ ముఖీ ఆయనతో ప్రమాణం చేయించారు. హిమంతతో పాటు 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారం తర్వాత మాట్లాడిన హిమంత.. అభివృద్ధిలో దేశంలోనే తొలి ఐదు రాష్ట్రాల్లో అసోంను ఒకటిగా నిలుపటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

" మా లక్ష్యాన్ని సాధించేందుకు రేపటి నుంచే పని ప్రారంభిస్తాం. ప్రస్తుతం మా ప్రధాన కర్తవ్యం కొవిడ్​-19 మహమ్మారిని అరికట్టటమే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. వరద ముంపు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో కొవిడ్​ పరిస్థితి తీవ్రంగా ఉంది. రోజు వారీ కేసులు 5 వేల మార్క్​ను దాటాయి. అన్ని విధాలుగా చర్చించి చర్యలు తీసుకుంటాం. అసోంలో కరోనా కట్టడి కాకుండా ఈశాన్య ప్రాంతంలోని ఏ రాష్ట్రంలోనూ కేసులు తగ్గుముఖం పట్టవు. "

- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి.

యూఎల్​ఎఫ్​(ఐ) వంటి తిరుగుబాటు బృందాలు ఆయుధాలు విడనాడి, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు హిమంత. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. కిడ్నాపులు, హత్యలు సమస్యలను మరింత పెంచుతాయే తప్పా, పరిష్కారం చూపవన్నారు. వచ్చే ఐదేళ్లలో వారంతా జనజీవన స్రవంతిలో చేరుతారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్​ఆర్​సీ విషయం అడగగా.. సరిహద్దు జిల్లాల్లో 20 శాతం, ఇతర ప్రాంతాల్లో 10 శాతం పేర్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. చిన్న పాటి పొరపాట్లు కనిపిస్తే.. ప్రస్తుత ఎన్​ఆర్​సీని కొనసాగిస్తామని, భారీ స్థాయిలో ఉంటే కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు.

అభివృద్ధి ప్రయాణం మరింత ముందుకు: మోదీ

అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భాజపా నేత హిమంత బిశ్వ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే.. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​పై ప్రశంసలు కురిపించారు మోదీ. రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు.

ఇదీ చూడండి:అసోం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణస్వీకారం

Last Updated : May 10, 2021, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details