టీకాల పనితీరును చాటిచెప్పడానికి యాంటీబాడీల ఉత్పత్తి ఒక్కటే ప్రామాణికం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. దీన్నిబట్టి టీకా పనితీరును అంచనా వేయడానికి వీల్లేదన్నారు. భారత్‌లో లభ్యమవుతున్న వ్యాక్సిన్లన్నీ ఇంతవరకు దేశంలో కనిపించిన వైరస్ రకాలపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
"టీకాలు పలు రకాలుగా రక్షణ కల్పిస్తాయి. యాంటీబాడీలు, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మెమొరీసెల్స్ (కణ ప్రమేయంతో పనిచేసే రోగ నిరోధక వ్యవస్థ) ద్వారా రక్షణ ఇస్తాయి. వైరస్ సోకినప్పుడు అధిక యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన డేటా ప్రకారం కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వీ టీకాల సామర్థ్యం దాదాపు ఒకేలా ఉంది. అందువల్ల ప్రజలు తమకు ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. దానివల్ల వారికే కాకుండా, వారి కుటుంబానికి కూడా రక్షణ లభిస్తుంది"
- రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
గర్భిణులకు త్వరలో టీకా అందుబాటులోకి వస్తుందని గులేరియా చెప్పారు. ఇప్పటికే చాలా దేశాలు ఈ టీకాలను ప్రారంభించినట్లు తెలిపారు. "ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను గర్భిణులకు ఇవ్వడానికి యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి కొవాగ్జిన్, కొవిషీల్డ్ డేటా ఇప్పటికే కొంత అందుబాటులో ఉంది. త్వరలో పూర్తిస్థాయి డేటా అందుబాటులోకి వస్తుంది" అని వివరించారు. పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఎలాంటి సంకోచం లేకుండా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని పునరుద్ఘాటించారు. కొవిడ్ వచ్చిపోయిన వారు కోలుకున్న రోజు నుంచి 3 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే బలమైన రోగ నిరోధకశక్తి ఏర్పడుతుందన్నారు.
యాంటీబాడీ పరీక్షల అవసరం లేదు