వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలని ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా సూచించారు. విదేశాల నుంచి వ్యాక్సిన్ల సేకరణకు సమగ్ర వ్యూహంతో పనిచేయాలన్నారు. 'జులై చివరినాటికి ప్రతి రోజూ కోటి మందికి టీకా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం టీకా ఉత్పత్తిని పెంచాలి. విదేశాల నుంచి వ్యూహాత్మకంగా డోసులను తెప్పించుకోవాలి' అని గులేరియా పేర్కొన్నారు.
వ్యాక్సిన్ సేకరణకు కచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. పలువురితో కాకుండా ఒక్కరితోనే చర్చలు జరిపేందుకు తయారీదారులు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఔషధ తయారీదారులు దిల్లీ, పంజాబ్‌తోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను నెరవేర్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరిపేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు గులేరియా గుర్తుచేశారు. టీకాలను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలన్నారు.