తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెమ్​డెసివిర్​ వల్ల మరణాలు తగ్గవు: గులేరియా

కరోనా చికిత్స కోసం ఉపయోగించే మందులు సరైన సమయంలో, సరైన మోతాదులో ఉపయోగించాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్​దీప్ గులేరియా అన్నారు. రెమ్​డెసివిర్ వల్ల మరణాలేవీ తగ్గవని అభిప్రాయపడ్డారు.

guleria, AIIMS director
రణ్​దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

By

Published : Apr 20, 2021, 7:48 AM IST

కరోనా చికిత్స కోసం ఉపయోగించే మందులన్నింటికీ పరిమిత పాత్ర మాత్రమే ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు. వాటిని సరైన సమయంలో, సరైన మోతాదులో మాత్రమే ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా ఉపయోగించాలని సూచించారు. లేదంటే రోగులకు ప్రయోజనం కంటే కీడే ఎక్కువ జరుగుతుందని హెచ్చరించారు. దేశంలో రెమ్‌డెసివిర్‌, టొసిజొలిమాబ్‌ మందులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో గులేరియా సోమవారం రోజు పలు కీలక సూచనలు చేశారు. ప్లాస్మా థెరఫీ ప్రయోజనం పరిమితమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

వినియోగ సమయమూ ముఖ్యం(గులేరియా మాటల్లో)

ఏడాది కాలంగా కరోనాపై అధ్యయనం చేస్తున్నాం. కొవిడ్‌ చిక్సితలో మందులు, వాటి వినియోగ సమయం చాలా ముఖ్యం. మందులు చాలా ముందుగా ఇచ్చినా, చాలా ఆలస్యంగా ఇచ్చినా రోగులకు నష్టం కలిగించినట్లే. మందులు ఇవ్వడం ఎంత ముఖ్యమో, అవి సరైన సమయంలో వాడటం కూడా అంతే ముఖ్యం. తొలి రోజునుంచే మందుల మిశ్రమాన్ని (కాక్‌టైల్‌ ఆఫ్‌ డ్రగ్స్‌) ఇస్తూపోతే రోగికి చాలా నష్టం చేకూరుస్తుంది.

కొవిడ్‌ రోగులపై రెమిడెసివిర్‌ ఎలాంటి ప్రభావం చూపలేదని, మరణాలను తగ్గించే శక్తి దీనికి లేదని తొలినాళ్లలో చైనా, డబ్ల్యూహెచ్‌ఓ జరిపిన అధ్యయనాల్లో తేలింది. అందువల్ల అదేమీ మరణాలను తగ్గించదు. ఆసుపత్రిలో చేరి, ఆక్సిజన్‌ స్థాయి పడిపోయిన వారు, చెస్ట్‌ ఎక్స్‌రే, సీటీస్కాన్‌లో వైరస్‌ సోకినట్లు కనిపించిన వారు మాత్రమే రెమిడెసివిర్‌ ఉపయోగించాలి. 5-7 రోజుల సమయంలో వైరల్‌లోడ్‌ తగ్గి ఉంటుంది కాబట్టి రెమిడెసివిర్‌ ఇవ్వడం వల్ల కొంత ప్రయోజనం ఉండొచ్చు. అంతే తప్పితే తొలినాళ్లలో ఇవ్వకూడదు. అది కూడా లక్షణాలు లేని, తేలికపాటి లక్షణాలున్న వారిపై ప్రయోగించకూడదు. అలాగే ఎక్కువ ఆలస్యంగానూ ఇవ్వకూడదు.

స్టిరాయిడ్స్‌ వల్లే ఎక్కువ రికవరీ ఫలితాలు వచ్చాయి. అవికూడా తొలినాళ్లలో ఇవ్వకూడదు. అలా ఇస్తే ఫలితం కంటే ప్రమాదమే ఎక్కువ. సైటోకెయిన్‌స్టామ్‌, ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగి, ఆక్సిజన్‌స్థాయి తగ్గుతున్నప్పుడు మాత్రమే స్టిరాయిడ్స్‌ ఇవ్వాలి. ప్లాస్మా థెరఫీ వల్లా పరిమిత ప్రయోజనాలే తప్ప పెద్ద ఫలితాలు లేవని ఐసీఎంఆర్‌తోపాటు, పలువురు నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. టొసిజొలిమాబ్‌ ఔషధం 2% కంటే తక్కువ రోగులకే అవసరం అవుతుంది. సైటోకెయిన్‌స్టామ్‌ వచ్చిన వారికే దీన్ని ఉపయోగించాలి. అందువల్ల దీని పాత్ర పరిమితమే అని గుర్తించాలి. లక్షణాలులేని వారు, తేలికపాటి లక్షణాలున్న వారికి ఏ మందూ ఇవ్వకపోయినా పరిస్థితులు కుదటపడతాయి.

ఓ మోస్తరు లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారి విషయంలో మాత్రమే స్టిరాయిడ్స్‌, రెమిడెసివిర్‌, తీవ్ర సైటోకెయిన్‌స్టామ్స్‌ ఉన్నవారి విషయంలో టొసిజొలిమాబ్‌ గురించి ఆలోచించాలి. అవసరంలేని మందులు ప్రయోగించడంవల్ల ఎక్కువ నష్టం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు, వైద్య సిబ్బంది గ్రహించాలి.

ఇదీ చదవండి:ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష!

ABOUT THE AUTHOR

...view details