తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, తన మిత్రపక్షం భాజపా మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. పలుమార్లు చర్చల అనంతరం.. కన్యాకుమారి లోక్‌సభ స్థానం సహా 20 అసెంబ్లీ సీట్లను భాజపాకు కేటాయించింది అన్నాడీఎంకే. దీంతో కన్యాకుమారి స్థానానికి జరిగే ఉపఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది భాజపా.
ఆరుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసిన అన్నాడీఎంకే.. అనంతరం కమలం పార్టీ నేతలతో చర్చలు జరిపి 20 స్థానాలను కేటాయించింది. ఎన్నికల బరిలోకి దిగనున్న భాజపా అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుదని అధికార పార్టీ పేర్కొంది.