తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన అన్నాడీఎంకే.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్నీర్‌సెల్వం కుమారులు, మరో 16 మంది ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి.
పన్నీర్ సెల్వం కుమారుల్లో ఒకరు రవీంద్రనాథ్ తేని నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమారుడు జయప్రదీప్, మాజీ మంత్రి ఎన్ నటరాజన్పైనా పార్టీ వేటు వేసింది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. వీరంతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేశారని, అన్నాడీఎంకేకు చెడ్డ పేరు తెచ్చారని ఓ ప్రకటనలో తెలిపారు పళనిస్వామి.