తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా దేశం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ప్రధాన ప్రత్యర్థులైన అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పోటీ ఓ కారణమైతే.. ఇరు పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు మరో కారణం. రూపాయికి కిలో బియ్యం నుంచి ఉచిత వాషింగ్‌మెషిన్ల వరకు ఎన్నో హామీలను తమిళ ప్రజలు పొందారు. ఉచిత టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మిక్సీలు, పాలిచ్చే ఆవులు సహా ఉచిత మంగళ సూత్రం వీటిలో ఉన్నాయి. ఎన్ని అమలయ్యాయి అన్నదాని కన్నా.. వచ్చే ఎన్నికల్లో ఇంకా వేటిని ఉచితంగా ప్రకటిస్తారన్న అంశమే ఆసక్తికరంగా ఉంటుంది. 2006లో కరుణానిధి ప్రకటించిన మేనిఫెస్టో దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ మేనిఫెస్టోలోనే ఉచిత కలర్ టీవీలను అందిస్తామని డీఎంకే ప్రకటించింది. అప్పటి నుంచి ఉచిత హామీలు తమిళనాట ఓ ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ ద్రవిడ పార్టీలు ఉచితాల వైపే మొగ్గు చూపాయి. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ ఉచిత హామీలు మరింత పాతాళానికి అణగదొక్కుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:తమిళనాట పోటాపోటీగా 'ఉచిత హామీల' వల!
ఎవరి ప్రత్యేకత వారిదే..
తమిళనాట ఉన్న పార్టీల్లో ఉచిత హామీలు ప్రకటించడంలో వేటికదే ప్రత్యేకం. వరుసగా మూడోసారి అధికారం పొందాలని అన్నాడీఎంకే ఆకాంక్షిస్తుండగా.. దశాబ్దం పాటు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అధికారంలోకి రావాలని ఉవ్విళూరుతోంది. ఈ నేపథ్యంలోనే, రెండు పార్టీలు పోటీ పడి మరీ ఉచిత హామీలు గుప్పించాయి. ఉచిత వాషింగ్ మెషిన్లు, ఇళ్లు, సోలార్ స్టవ్‌లతో పాటు విద్యారుణం మాఫీ, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలను అన్నాడీఎంకే ప్రకటించింది. డీఎంకే కూడా కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు 4 వేల రూపాయల సాయం, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు, వివిధ రకాల రుణాల మాఫీని మేనిఫెస్టోలో పొందుపరిచింది. తమిళనాడు ఖజానాను అధికంగా నింపుతున్న మద్యం అమ్మకాలను దశలవారీగా నిషేధిస్తామని ఇరు పార్టీలు హామీ ఇచ్చాయి. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ ఒక అడుగు ముందుకువేసి అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. అటు, కరోనా రెండో వేవ్ నేపథ్యంలో, అధికారం చేపట్టగానే తమ హామీలను ప్రభుత్వ పథకాలుగా మారుస్తామని రెండు పార్టీలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. డీఎంకే మేనిఫెస్టో
ఆర్థిక నిపుణుల ఆందోళన