ఎయిర్ఇండియాలో మూత్ర విసర్జన చేసిన ఘటన మరవకముందే మరో ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. దిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్‌ఇండియా AI 111 విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికుడి దురుసు ప్రవర్తన కారణంగా పైలెట్ విమానాన్ని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి దిల్లీ విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్‌ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటికే ప్రయాణికుడి అనుచిత ప్రవర్తనపై విమాన సిబ్బంది రెండు సార్లు హెచ్చరించినట్లు పేర్కొంది. నిందితుడిని దిల్లీ విమానాశ్రయంలో పోలీసులుకు అప్పగించినట్లు ఎయిర్‌ఇండియా వెల్లడించింది. విమానంలోని ప్రతి ఒక్కరి భద్రత, గౌరవానికి ఎయిర్‌ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. విమానాన్ని తిరిగి మధ్యాహ్నం లండన్‌కు పంపించనున్నట్లు తెలిపింది. అయితే, గొడవకు గల కారణాన్ని ఎయిర్‌ఇండియా స్పష్టంగా పేర్కొలేదు.
"దిల్లీ నుంచి ఉదయం 6:35 గంటల సమయంలో ఎయిర్ఇండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత ఓ ప్రయాణికుడు ఇద్దరు క్యాబిన్ సిబ్బందితో గొడవ పడి వారిపై దాడి చేశాడు. సిబ్బంది హెచ్చరించినా వినకపోవడం వల్ల.. విమానాన్ని 9:40 గంటలకు తిరిగి దిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. విమానంలో సుమారు 225 మంది ప్రయాణికులు ఉన్నారు."
--డీజీసీఏ అధికారులు