1976 స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది రాజకీయాల్లోకి ప్రవేశించిన అహ్మద్ పటేల్ అనతి కాలంలో పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. 27 ఏళ్ల వయస్సులోనే ఆయన ప్రతిభను గుర్తించిన ఇందిరాగాంధీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించి అసాధారణ నాయకుడిగా తీర్చి దిద్దారు. తర్వాత కాలంలో ఆయనే ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారి పార్టీని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ట్రబుల్ షూటర్‌గా పార్టీలో ఎన్నో వివాదాల్ని పరిష్కరించారు. సుదీర్ఘ కాలం సోనియా గాంధీకి రాజకీయ సలహదారుగా వ్యవహరించి ఆమెకు అత్యంత నమ్మకస్తుడిగా మారారు.
ఇందిరా గాంధీ గుర్తించడంతో..
అహ్మద్ పటేల్ 1949, ఆగస్టు 21న గుజరాత్‌లోని భరూచ్‌లో జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే యూత్ కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. 1976లో తొలిసారి భరూచ్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ భరూచ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా బరిలోకి దింపారు. అక్కణ్నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌లో ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని చాటుకున్నారు. ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభ, అయిదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1985లో రాజీవ్‌గాంధీకి పార్లమెంటు కార్యదర్శిగా వ్యవహరించారు.
సోనియాకు రాజకీయాల్లో అన్నీ తానై..
1997లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీకి రాజకీయాల్లో అహ్మద్ పటేలే అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ పరిస్థితిని వివరించి.. ముందుకు తీసుకెళ్లడంలో ఉన్న మార్గాలు, వ్యూహాలను ఆమెకు వివరించారు. సోనియా నేతృత్వంలో తిరిగి కాంగ్రెస్ పునర్‌వైభవం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2004, 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర ఎనలేనిదని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గ కూర్పు, యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడంలో ఈ రాజకీయ దిగ్గజానిదే ప్రధాన పాత్ర.
సంక్షోభమా.. పటేల్ వైపే చూపు..
సంక్షోభం అంటే పార్టీ మొత్తం అహ్మద్ పటేల్‌వైపే చూసేది. పార్టీ అంతర్గత విభేదాలైనా.. ప్రభుత్వంలో సమస్యలైనా.. పటేల్ తనదైన శైలిలో పరిష్కరించేవారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకన్న సమయంలో పార్లమెంటులో పార్టీ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో రంగంలోకి దిగిన పటేల్ తన చతురతతో ఆ సంక్షోభం నుంచి పార్టీని సునాయాసంగా గట్టెక్కించారు. పార్టీలకు అతీతంగా ఆయనకున్న సన్నిహిత సంబంధాలే ఆ సమయంలో ఆయనకు.. తద్వారా పార్టీకి ఆసరాగా నిలిచాయి. ఇటు సీనియర్లతో పాటు యువనాయకులతోనూ పటేల్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. సీనియర్లు, జూనియర్లకు మధ్య వారధిగా ఉండేవారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఇటీవల రాజస్థాన్‌లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలో ఆయనతో చర్చలు జరిపి ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించారు.