వ్యవసాయమే భారత దేశానికి ప్రధాన వ్యాపారం అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు మద్దతుగా కేరళలోని వయనాడ్‌లో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.
దేశ రాజధానిలో అన్నదాతలు పడ్డ కష్టాలను ప్రపంచం మొత్తం చూసిందన్న రాహుల్.. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులు పడుతోన్న ఇబ్బందులపై ప్రముఖులందరూ స్పందిస్తున్నా.. మోదీ సర్కార్‌కు మాత్రం చీమ కుట్టునట్లైనా లేదన్నారు.
"భారత దేశంలో వ్యవసాయరంగాన్ని నాశనం చేసేందుకు మోదీ పావులు కదుపుతున్నారు. తన ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు లబ్ధి చేకూర్చడానికే సాగు చట్టాలను తీసుకువచ్చారు. వ్యవసాయంపై సుమారు రూ. 40 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతోంది. ఇది ప్రతీ భారతీయునికి చెందింది. అలాంటిది కేవలం కొంతమంది చేతుల్లోకి వెళ్లడం అనేది తప్పు."