భార్యను మరో నలుగురితో కలిసి నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకి తోసేశాడు ఓ భర్త. ఈ ఘటనలో రితికా సింగ్(30) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుల్లో ముగ్గరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్య కేసు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో శుక్రవారం ఉదయం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..: ఆకాశ్ గౌతమ్, రితికా సింగ్‌కు 2014లో వివాహం జరిగింది. రితికా సింగ్.. ఘజియాబాద్ వాసి కాగా, ఆకాశ్ ఫిరోజాబాద్‌కు చెందిన వ్యక్తి. ఇరువురి మధ్య మనస్పర్థల వల్ల 2018నుంచి దూరంగా ఉంటున్నారు. అనంతరం ఫేస్బుక్లో పరిచయమైన విపుల్ అగర్వాల్‌తో కలిసి తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రితికా సింగ్ నివసిస్తోంది.
రితికా సింగ్ భర్త ఆకాష్ గౌతమ్.. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో కలిసి శుక్రవారం రితిక అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. అనంతరం రితిక, ఆమె ప్రియుడు విపుల్ అగర్వాల్‌తో వాగ్వాదానికి పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత విపుల్ అగర్వాల్ చేతులు కట్టేసి బాత్రూమ్లో పడేశారు. అనంతరం రితికను చేతులను కట్టేసి నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. బాత్రూమ్ కిటికీ నుంచి విపుల్ అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వచ్చి అతడ్ని విడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.