Agra Train Accident Today :ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్(14624) రైలులోని రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
Patalkot Express Fire Accident :జిల్లాలోని మల్పురా పోలీస్ స్టేషన్‌లోని భదాయి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి మూడు, నాలుగు బోగీల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.
"ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా డివిజన్‌లో పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న రెండు కోచ్‌లు కూడా ప్రభావితమయ్యాయి. మొత్తం నాలుగు కోచ్‌లు రైలు నుంచి వేరు చేశాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది" అని ఆగ్రా డివిజిన్ పీఆర్వో చెప్పారు. ఈ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని సియోనీ మధ్య నడుస్తున్నట్లు తెలిపారు