రెండు మూడు రోజులకోసారి పాము వచ్చి.. ఒకే యువకుడ్ని కాటేయడం వెనుక మిస్టరీ వీడలేదు. ఆ సర్పం.. ఇప్పటికీ అతడ్ని వెంటాడుతూనే ఉంది. గత వారం రోజుల్లో మరో 3సార్లు కాటేసింది. ఫలితంగా.. గత 15 రోజుల్లో మొత్తం 8సార్లు పాము కాటుకు గురయ్యాడు ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రా జిల్లా మన్‌కేఢా గ్రామానికి చెందిన రజత్ చాహర్(20). అసలు ఆ పాము అతడ్ని ఎందుకు వెంటాడుతోందో, ప్రతిసారీ ఎడమ కాలిపైనే కాటేయడానికి కారణమేంటో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సమాచారంతో.. రజత్ చాహర్ ఇంటిని మరోమారు సందర్శించింది ఈటీవీ భారత్ బృందం. సర్పానికి భయపడి అసలు తాను బయటకు వెళ్లడం లేదని చెప్పాడు బాధితుడు. "ఏడాది క్రితం నా సోదరుడు ఓ పామును చంపాడు. అప్పుడు నేను నొయిడాలో ఉన్నాడు. నాగదేవత పగ తీర్చుకోవాలని అనుకుంటే.. నా వెనుక ఎందుకు పడింది? అసలు ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు రజత్.
రజత్‌ను 'పాము వెంటాడడం'.. మన్కేఢాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశమైంది. రజత్‌ను పరామర్శించేందుకు, అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో వస్తున్నవారితో వారి ఇల్లంతా సందడిగా మారింది. కొందరు గ్రామస్థులు.. రజత్ ఇంటి వద్ద రకరకాల పూజలు చేస్తున్నారు. సంగీత వాద్యాలు మోగిస్తున్నారు. అలా చేస్తే.. నాగ దేవత సంతోషించి బయటకు వస్తుందని, తనకు ఏం కావాలో చెబుతుందని అంటున్నారు స్థానికులు.
సెప్టెంబర్ 6న మొదలు..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మల్పురా ప్రాంతంలోని మన్‌కేఢా గ్రామానికి చెందిన రామ్ కుమార్ చాహర్ తనయుడైన రజత్ చాహర్.. డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6న రాత్రి 9 గంటలకు ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ పాము అతడి ఎడమ కాలిపై కాటేసింది. భయంతో రజత్ గట్టిగా అరిచాడు. ఇంట్లోని వాళ్లు వచ్చేసరికి పాము వెళ్లిపోయింది. హుటాహుటిన అతడ్ని నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత కాసేపటికి ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. 4 గంటలపాటు అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేక్షించారు. పాము కాటు లక్షణాలేవీ కనిపించడం లేదని రజత్‌ను ఇంటికి పంపేశారు.
రజత్ కాలి వేలుపై పాము కాటు! సెప్టెంబర్ 8న సాయంత్రం ఇంటి బయట ఉన్న బాత్రూమ్కు వెళ్లాడు రజత్. అప్పుడు అతడి ఎడమ కాలిపై మరోసారు పాము కాటేసింది. రజత్‌ను హుటాహుటిన ముబారక్‌పుర్ తీసుకెళ్లి, నాటు వైద్యుల దగ్గర చికిత్స చేయించారు. అయినా ఆ పాము అతడ్ని విడిచి పెట్టలేదు. ఈనెల 11న ఇంట్లోని ఓ గదిలో ఉండగా; ఈనెల 13న బాత్రూమ్లో ఉండగా; ఈనెల 14న చెప్పులు వేసుకుంటుండగా రజత్‌ను పాము కరిచింది. ప్రతిసారీ కుటుంబ సభ్యులు అతడ్ని తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇదే విషయమై ఈటీవీ భారత్ అప్పట్లో వార్త ప్రచురించింది. వారం గడవకముందే.. తనను మరో 3సార్లు పాము కరిచిందని చెప్పాడు రజత్.
మరోవైపు.. కాటేసిన పాముపై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ వ్యక్తి. దానిని నోటితో కరిచి చంపేశాడు. చనిపోయిన సర్పాన్ని మెడలో వేసుకుని ఊరంతా షికార్లు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కర్ణాటకకు చెందిన లోకేశ్‌ది మరో కథ. వన్యప్రాణుల ప్రేమికుడైన లోకేశ్ ఇప్పటివరకు సుమారు 35,000 పాములను పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు. అయితే.. ఇటీవల నాగుపామును సంరక్షించే క్రమంలో కాటుకు గురై, చికిత్స పొందుతూ మరణించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.