అగ్నిపథ్ పథకం కింద సైనిక విభాగాల్లో ఎంపికైన తొలి విడత అగ్నివీరులను ప్రధాని నరేంద్ర మేదీ వర్చువల్‌గా కలుసుకున్నారు. త్రివిధ దళాల్లో స్వల్పకాలిక సైనిక సేవల కోసం ఎంపికైన అభ్యర్థులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. రాబోయే కాలంలో అగ్నివీర్లు సాయుధ దళాల్లో కీలక పాత్ర పోషించి.. బలగాలను మరింత బలోపేతం చేస్తారని మోదీ అన్నారు. రాబోయే తరాలకు ఈ మొదటి అగ్నివీర్ బ్యాచ్ మార్గనిర్దేశకులుగా ఉన్నందున వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
"విప్లవాత్మక మార్పునకు మార్గనిర్దేశకులుగా ఉన్నందుకు మీ అందరికీ అభినందనలు. అగ్నిపథ్ పథకం పారదర్శకమైనది. యువ అగ్నివీర్లు సాయుధ దళాలకు.. సాంకేతికపరంగా మరింత బలాన్ని చేకూరుస్తారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వీరు త్రివిధ దళాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఈ తరం యువతకు ఆ శక్తి,సామర్థ్యాలు ఉన్నాయి. రాబోయే కాలంలో అగ్నివీర్లు బలగాల్లో ముఖ్యపాత్ర పోషిస్తారు. వీరి రాకతో సైన్యం మరింత చైతన్యంతో నిండిపోయింది. 21వ దశాబ్దంలో యుద్ధాలు జరిగే విధానం పూర్తిగా మారిపోతుంది. త్రివిధ దళాల్లో మహిళా అగ్నివీర్లను చూడాలని ఎదురుచూస్తున్నాను. వారు వివిధ రంగాల్లో సాయుధ బలగాలకు నాయకత్వం వహిస్తున్నందున చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సియాచిన్లో మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని