Agnipath scheme controversy: సాయుధ బలగాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తమైంది. ఈ పథకంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం సమీక్ష చేపట్టారు. తన నివాసంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సైనిక విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు.
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే కూడా ఈ భేటీలో పాల్గొనాల్సి ఉండగా.. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఆయన స్థానంలో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బీఎస్ రాజు సమావేశంలో పాల్గొన్నారు. అగ్నిపథ్‌ను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనలపై ఈ భేటీలో రాజ్‌నాథ్ చర్చించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఉద్రిక్తతలను తగ్గించేలా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది.
అగ్నిపథ్ పథకాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మరోసారి గట్టిగా సమర్థించారు. మాజీ సైనికుల సంఘంతో సహా పలువురు నిపుణులతో సుమారు రెండేళ్ల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత.. ఈ పథకాన్ని ఏకాభిప్రాయంతో రూపొందించామని రక్షణ మంత్రి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం అగ్నిపథ్‌పై.. అపోహలు వ్యాప్తి చేస్తున్నారని రాజ్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా సైనిక నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్న రక్షణమంత్రి.. దీని ద్వారా నియమితులయ్యే సిబ్బందికి ఇచ్చే శిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అగ్నిపథ్ కొత్త పథకం కాబట్టి ప్రజల్లో కొంత గందరగోళం ఉండవచ్చన్నారు. ప్రజల్లో క్రమ శిక్షణ, దేశం పట్ల గర్వం అనే భావం ఉండాలని కోరుకున్నామని వెల్లడించారు. 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న కొన్ని నిరసనలు రాజకీయ ప్రేరేపితమన్న రాజ్‌నాథ్.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దేశ రక్షణే ధ్యేయమన్నారు. సైనికుల మనోధైర్యాన్ని తగ్గించే చర్యలు న్యాయం కాదని అన్నారు.
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు హోంశాఖ శనివారం ప్రకటించింది. అంతేగాక, ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయో పరిమితిలోనూ అగ్నివీరులకు సడలింపు కల్పించింది.
ఇదీ చూడండి :18 ఏళ్ల తర్వాత భార్యాపిల్లల చెంతకు.. ఇన్నిరోజులు పాపం ఒక్కడే!