'అగ్నిపథ్'ను వ్యతిరేకిస్తూ నిరసన Agnipath protest Bihar: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్వల్పకాలానికి జవాన్లను నియమించుకునే విధానంపై ఆర్మీలో చేరాలనుకునే ఆశావహులు.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బిహార్‌లో వరుసగా రెండోరోజూ వీధుల్లోకి వచ్చి యువకులు ఆందోళన చేశారు. రోడ్డు, రైలు మార్గాలను అడ్డుకున్నారు. పట్నా-గయా, పట్నా-బక్సర్ రహదారులను నిరసనకారులు నిర్బంధించారు. జెహానాబాద్‌లో 83వ నంబర్ జాతీయ రహదారిని అడ్డగించారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. రాష్ట్రంలోని జెహానాబాద్, ఛాప్ర, నవాదా జిల్లాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. టీఓడీ(టూర్ ఆన్ డ్యూటీ- అగ్నిపథ్)ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రోడ్లపై టైర్లు తగులబెట్టి... Agnipath recruitment protest:పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువకులు రైల్వే ట్రాక్‌లపైకి చేరుకున్నారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల నిరసన హింసాత్మకంగా మారింది. ఛాప్రాలో నిరసనకారులు రెండు రైళ్లకు నిప్పంటించారు. ఛాప్రా జంక్షన్లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును తగులబెట్టిన యువకులు.. మరో రైలుకు సైతం నిప్పంటించారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
రైలును తగులబెట్టిన నిరసనకారులు నిరసనకారుల అభిప్రాయం ఇదీ..
"ఇదివరకు చేపట్టిన విధంగానే నియామక ప్రక్రియ కొనసాగించాలి. టూర్ ఆఫ్ డ్యూటీని ఉపసంహరించుకోవాలి. గతంలో మాదిరిగానే నియామకం కోసం పరీక్షలు నిర్వహించాలి. కేవలం నాలుగేళ్ల కోసమే ఆర్మీలోకి ఎవరూ వెళ్లరు" అని ముంగేర్‌లో నిరసన చేస్తున్న ఓ వ్యక్తి పేర్కొన్నాడు.
"నాలుగేళ్లు పనిచేసిన తర్వాత మేం ఎక్కడికి వెళ్తాం. సర్వీసు పూర్తైన తర్వాత మేం రోడ్డునపడతాం. అందుకే ఇప్పుడు నిరసన చేస్తున్నాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని దేశ నాయకులకు ఇప్పుడు తెలుస్తుంది" అని జెహానాబాద్‌లో మరో నిరసనకారుడు తెలిపాడు.
"ఆర్మీలో చేరేందుకు చాలా కష్టపడతాం. నెలల తరబడి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాలుగేళ్లే పనిచేయడం ఎలా ఉంటుంది? దేశాన్ని ఎలా కాపాడగలుగుతాం. ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాల్సిందే" అని మరో అభ్యర్థి చెప్పాడు.
పుష్అప్స్ తీస్తూ యువత నిరసన రాజకీయ వ్యతిరేకత...
మరోవైపు, దీనిపై రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. అగ్నిపథ్‌పై కేంద్రం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకే రాహుల్ గాంధీ ఈ పథకాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 'భారత్‌కు రెండు వైపుల నుంచి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్న ఇలాంటి సమయంలో ఈ అగ్నిపథ్ పథకం మన సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విషయంలో రాజీ పడటాన్ని భాజపా సర్కార్ మానుకోవాలి' అని రాహుల్ పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా అగ్నిపథ్‌పై విమర్శలు చేశారు. సైనికుల సుదీర్ఘకాల సేవలను భారత ప్రభుత్వం భారంగా భావిస్తోందా? అంటూ ప్రశ్నించారు.
వస్తువులను తగులబెట్టిన నిరసనకారులు 'గ్రామీణ యువతకు మంచిది కాదు...'
తాజాగా, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సైతం కేంద్రంపై విమర్శలు చేశారు. ఈ పథకం వల్ల గ్రామీణ యువత నష్టపోతారని అన్నారు. "చాలా రోజుల నుంచి రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించకుండా... ఇప్పుడు కేంద్రం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఆకర్షణీయంగానే ఉన్నా.. దేశ యువత దీని పట్ల అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. బహిరంగంగానే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్మీతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో పెన్షన్ ప్రయోజనాలను పూర్తిగా రద్దు చేసేందుకే కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని వారు నమ్ముతున్నారు. గ్రామీణ కుటుంబాలు, యువతకు ఈ నిర్ణయం మంచిది కాదు" అని వరుస ట్వీట్లు చేశారు మాయావతి.
మరోవైపు, భాజపా సొంత ఎంపీ వరుణ్ గాంధీ సైతం ఈ పథకంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. అగ్నిపథ్ స్కీమ్.. యువతలో మరింత అసంతృప్తి రాజేస్తుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మంది సైనికులు నిరుద్యోగులుగా మారతారని ఆరోపించారు. ఆ తర్వాత ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. సాధారణ సైనికులే 15ఏళ్ల తర్వాత రిటైర్ అవుతున్నారని.. అలాంటిది నాలుగేళ్లకే ఉద్యోగం నుంచి దిగిపోయిన వీరిని నియమించుకునేందుకు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపకపోతే ఎలా అని ప్రశ్నించారు.
"నాలుగేళ్ల సర్వీసు వీరి చదువులకు ఆటంకం కలిగిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోవడం కష్టం. సర్వీసు పూర్తయ్యాక చదువు కొనసాగిస్తే.. తోటివారితో పోలిస్తే వెనకబడతారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరు నెలల సాధారణ శిక్షణతో రెజిమెంట్లను ఏర్పాటు చేయడం కూడా కష్టమవుతుంది. ఆరు నెలల సాధారణ శిక్షణతో రెజిమెంట్లను ఏర్పాటు చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. 25 శాతం అగ్నివీరులు మాత్రమే నాలుగేళ్ల తర్వాత సర్వీసులో కొనసాగుతారు. దీని వల్ల శిక్షణ సమయం, ఖర్చు వృథా అవుతుంది" అని వరణ్ గాంధీ పేర్కొన్నారు.
అగ్నిపథ్ పథకం దేశ భవిష్యత్‌కు ప్రాణాంతకంగా మారుతుందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దీన్ని అత్యంత నిర్లక్ష్య విధానంగా అభివర్ణించారు. దేశ భద్రత అంటే స్వల్పకాలిక సమస్య కాదని.. చాలా సుదీర్ఘమైన విషయమని అన్నారు.
ఇదీ చదవండి: