Agnipath Recruitment Scheme:అగ్నిపథ్ నియామక విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ త్రివిధ దళాల ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్కరణ ద్వారా యువత, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఆర్మీని సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సైన్యం సగటు వయసు పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశమని అన్నారు. కార్గిల్ రివ్యూ కమిటీ సైతం దీని గురించి ప్రస్తావించిందని గుర్తు చేశారు. ఈ సంస్కరణ చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉందని రక్షణ శాఖ సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ తెలిపారు. అగ్నివీరులకు వివిధ మంత్రిత్వ శాఖల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వచ్చిన ప్రకటనలు.. నిరసనల వల్ల కాదని పురీ స్పష్టం చేశారు. ఇదంతా ముందస్తు ప్రణాళికల్లో భాగమేనని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్నిపథ్ విధానాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Agneepath vacancy 2022:అగ్నిపథ్ స్కీమ్‌ను వెనకేసుకొచ్చిన ఆయన.. సర్వీసులో వారి పట్ల వివక్ష ఉండబోదని హామీ ఇచ్చారు. సియాచిన్ వంటి పలు ప్రాంతాల్లో పనిచేసే అగ్నివీరులకు.. సాధారణ సైనికులతో సమానంగా అలవెన్సులు లభిస్తాయని చెప్పారు. పథకం పనితీరును అంచనా వేయడం సహా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తొలుత 46 వేల మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు వివరించారు.
"వచ్చే నాలుగైదు ఏళ్లలో రిక్రూట్మెంట్ సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు ఉంటుంది. దీన్ని క్రమంగా 90 వేల నుంచి లక్ష వరకు పెంచుతాం. సమీప భవిష్యత్‌లోనే ఇది 1.25 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 46 వేల మందిని తీసుకుంటున్నాం. భవిష్యత్ నియామకాలు ఇదే స్థాయిలో మాత్రం ఉండవు. దేశసేవలో అమరుడైతే అగ్నివీరుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందుతుంది. కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారన్న వాదన సరికాదు. త్రివిధ దళాల నుంచి ఏటా సగటున 17,600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారు. వీరంతా రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ అడగడం లేదు."
-లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ
మరోవైపు, నిరసనలు చేస్తున్న వారికి షాక్ ఇచ్చారు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ. విధ్వంసానికి పాల్పడేవారిని ఆర్మీలో చేర్చుకునేది లేదని తేల్చిచెప్పారు. హింసాత్మక ఆందోళనలను తాము ఊహించలేదన్న ఆయన.. ఆర్మీలో క్రమశిక్షణారాహిత్యానికి తావులేదని స్పష్టం చేశారు. 'భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయి. ఆస్తుల విధ్వంసానికి తావు లేదు. ప్రతి అభ్యర్థి నిరసనల్లో పాల్గొనలేదని ధ్రువపత్రం సమర్పించాలి. అది లేకుంటే ఎవరినీ చేర్చుకునేది లేదు. ఎవరిపై అయినా ఎఫ్ఐఆర్ దాఖలు అయితే.. వారికి ఆర్మీలో చేరే అవకాశం ఉండదు. విధ్వంసానికి పాల్పడలేదని వారు ఎన్రోల్మెంట్లో రాతపూర్వకంగా పేర్కొనాలి. ఆ తర్వాత పోలీసుల ద్వారా వెరిఫికేషన్ ఉంటుంది' అని స్పష్టం చేశారు.
వాయుసేనలో తొలి అగ్నివీరుల బ్యాచ్ రిజిస్ట్రేషన్ జూన్ 24 నుంచి ప్రారంభమవుతుందని, జులై 24 నుంచి ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్షలు మొదలవుతాయని ఎయిర్ మార్షల్ ఎస్కే ఝా చెప్పారు.' డిసెంబర్ నాటికి తొలి బ్యాచ్‌ను చేర్చుకుంటాం. డిసెంబర్ 30 నాటికి శిక్షణ మొదలుపెడతాం' అని వివరించారు. మరోవైపు, నావికాదళానికి సంబంధించిన అగ్నివీరులు నవంబర్ 21 నాటికి తమ తమ శిక్షణా శిబిరాలకు చేరుకుంటారని నేవీ వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ చిల్కాలో వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పురుషులతో పాటు మహిళా అభ్యర్థులను సైతం నియమించుకోనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం నేవీలో 30 మంది మహిళా అధికారులు ఉన్నారని చెప్పారు. అగ్నిపథ్ ద్వారా రిక్రూట్ చేసుకున్న మహిళా సిబ్బందిని యుద్ధనౌకల్లోనూ మోహరిస్తామని తెలిపారు.
డిసెంబర్ తొలి వారం నాటికి తొలి బ్యాచ్‌లో 25వేల మంది అగ్నివీరులను చేర్చుకుంటామని, 2023 ఫిబ్రవరి నాటికి రెండో బ్యాచ్‌ను నియమించుకుంటామని లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప తెలిపారు. 2023 ఫిబ్రవరి నాటికి నియామకాల సంఖ్య 40వేలకు చేరుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రిక్రూట్మెంట్ ర్యాలీలు ఉంటాయని స్పష్టం చేశారు. 40 వేల మందిని నియమించుకునేందుకు 83 ర్యాలీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: