తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అగ్నిపథ్​'పై ఆగని ఆందోళనలు.. లుధియానా రైల్వే స్టేషన్​పై దాడి - అగ్నిపథ్​ ఆందోళన

agnipath-protests-protests-continued-against-scheme-bus-set-on-fire-in-jaunpur
agnipath-protests-protests-continued-against-scheme-bus-set-on-fire-in-jaunpur

By

Published : Jun 18, 2022, 12:28 PM IST

Updated : Jun 18, 2022, 4:30 PM IST

16:25 June 18

పంజాబ్ లుధియానా రైల్వే స్టేషన్​లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే ట్రాక్​తో పాటు స్టేషన్​లోని దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 8-10 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అమృత్​సర్​ రైల్వే స్టేషన్​లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

11:47 June 18

'అగ్నిపథ్​'పై ఆగని ఆందోళనలు.. లుధియానా రైల్వే స్టేషన్​పై దాడి

చెన్నైలోని యుద్ధ స్మారకం వద్ద నిరసన

Agnipath Protests: సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్​ పథకంపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా.. శనివారం పరిస్థితులు కొంచెం శాంతించాయి. పలు చోట్ల శాంతియుతంగా నిరసనలు జరుగుతున్నాయి. తమిళనాడు చెన్నైలోని సెక్రటేరియట్​ సమీపంలో యుద్ధ స్మారకం వద్ద భారీగా యువత గుమికూడారు. అగ్నిపథ్​కు వ్యతిరేకంగా ఆర్మీ ఆశావహులు నిరసనలు చేస్తున్నారు. వెల్లూర్​, తిరువన్నమలై, తిరుప్పుర్​ సహా పలు జిల్లాల నుంచి నిరసనకారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ జౌన్​పుర్​లో నిరసనకారులు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఓ బస్సుకు నిప్పుపెట్టారు. ప్రయాణికులను బస్సు నుంచి దించిన తర్వాత.. బస్సును ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. చందౌలీ డిపోకు చెందిన బస్సు.. లఖ్​నవూ నుంచి వారణాసి వెళ్తుండగా బద్లాపూర్​ పరిధిలో బస్సును అడ్డుకున్నారు దుండగులు.
పంజాబ్​లోని జలంధర్​లోనూ అగ్నిపథ్​ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

సుప్రీంకోర్టులో పిటిషన్​..అగ్నిపథ్​ పథకానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో ఓ పిటిషన్​ దాఖలైంది. రైల్వే సహా పలు ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టంపైనా దర్యాప్తు చేయాలని పిటిషన్​దారు డిమాండ్​ చేశారు.

త్రివిధ దళాధిపతులతో రాజ్​నాథ్ భేటీ:అగ్నిపథ్​ నిరసనల వేళ.. త్రివిధ దళాధిపతులతో తన నివాసంలో భేటీ అయ్యారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. నేవీ చీఫ్​ అడ్మైరల్​ ఆర్​ హరి కుమార్​, వాయుసేనాధిపతి ఎయిర్​ చీఫ్​ మార్షల్​ వివేక్​ రామ్​ చౌదరి.. రాజ్​నాథ్​ నివాసానికి చేరుకున్నారు.

దొంగతనాలు: అగ్నిపథ్​ నిరసన ముసుగులో కొంతమంది చోరీలకు పాల్పడ్డారు. బిహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రూ.3లక్షల నగదును ఆందోళనకారులు ఎత్తుకెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లోని అర్రాహ్‌ ప్రాంతంలో బిహియా రైల్వే స్టేషన్‌ వద్ద యువత శుక్రవారం ఆందోళనకు దిగింది. స్టేషన్‌లోని దుకాణాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో కొందరు ఆందోళనకారులు టికెట్ కౌంటర్‌లోని రూ.3లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూ. 200 కోట్లకుపైగా నష్టం: బిహార్​లో రైల్వే స్టేషన్లు సహా సమీప ప్రాంగణంలో జరిగిన విధ్వంసంతో రూ. 200 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు దానాపుర్​ రైల్వే డివిజన్​ డీఆర్​ఎం ప్రభత్​ కుమార్​. 50 కోచ్​లు, 5 ఇంజిన్లు పూర్తిగా కాలిపోయాయని పేర్కొన్నారు. ప్లాట్​ఫాంలు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి ధ్వంసమైందని, పలు రైళ్లు రద్దయ్యాయని తెలిపారు.

అంబులెన్స్‌పై దాడి:బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ.. బిహార్‌లో శనివారం కూడా చెదురుమొదురు ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ ఉదయం అర్వాల్‌ జిల్లాలో కొందరు నిరసనకారులు అంబులెన్స్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. పలు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అటు యూపీలోనూ నిన్న హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా.. 260 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరులో లాఠీఛార్జ్​:బెంగళూరులో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారి తీసింది. ధార్వాడ జిల్లాలోని నైఖా సర్కిల్‌ వద్ద గుమికూడిన యువకులు అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో యువకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. స్వల్ప లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

పంజాబ్​లో రైళ్ల రాకపోకలకు అంతరాయం: పంజాబ్‌లోని అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులు లుథియానా రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారు. లుథియానా రైల్వే స్టేషన్ అద్దాలు ధ్వంసం చేసిన నిరసనకారులు.. పట్టాలపై రైల్వే సామాగ్రి వేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్పించారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి:అగ్నిపథ్‌పై ఎందుకింత అలజడి..? ఒకసారి క్షుణ్నంగా పరిశీలిస్తే..

అగ్నిపథ్​పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం

Last Updated : Jun 18, 2022, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details