అగ్నివీరుల నియామకంలో కేంద్రం కులానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కులాలకు ప్రాధాన్యం ఇచ్చే ఆర్ఎస్ఎస్కు చెందిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ నియామకాలను అదే విధంగా చేపడుతోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. నాలుగేళ్ల తర్వాత సైన్యంలోకి తీసుకునే 25 శాతం మందిలో అగ్రకులాలు, మతాల వారే ఉంటారని పేర్కొన్నారు. సైన్యంలో రిజర్వేషనే లేనప్పుడు కాస్ట్ సర్టిఫికెట్ ఎందుకని ప్రశ్నించారు. అగ్నిపథ్ నియామకాల్లో కులం, మతానికి సంబంధించి ధ్రువపత్రం అడగడంపై ప్రతిపక్షాలు ఈ విధంగా స్పందించాయి.
భాజపా ఎంపీ వరణ్ గాంధీ కూడా కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కులాల ద్వారానే వ్యక్తుల దేశభక్తి గుర్తిస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. "చరిత్రలో తొలిసారిగా సైనిక నియామకాల్లో కుల, మతాల గురించి ప్రస్తావన వచ్చింది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు మోదీ సైన్యంలో అవకాశం ఇవ్వరా? మోదీ ప్రభుత్వం అసలు రూపం ఇప్పుడు బయటపడింది. మోదీ జీ మీరు అగ్నివీరులను చేస్తారా లేక జాతివీరులనా?" అని ట్వీట్ చేశారు.