తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగ్నిపథ్​పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం

Agnipath: 3 yrs age relaxation beyond upper age limit to Agniveers for recruitment in the two forces.
Agnipath: 3 yrs age relaxation beyond upper age limit to Agniveers for recruitment in the two forces.

By

Published : Jun 18, 2022, 9:32 AM IST

Updated : Jun 18, 2022, 9:58 AM IST

09:21 June 18

అగ్నిపథ్​పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం

Agnipath Age Limit: సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్​ పథకంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మోదీ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్​), అసోం రైఫిల్స్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.

అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది. ఫలితంగా తొలిబ్యాచ్‌ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కారణంగా రెండేళ్లు రిక్రూట్​మెంట్​ జరగలేదని.. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్‌ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే.

సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం 'అగ్నిపథ్‌'పై నిరసనలు శుక్రవారం మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. యువకుల ఆగ్రహంతో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. నిరసనకారులు పోలీసులతోనూ బాహాబాహీకి దిగారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తోపాటు సైనిక ఉద్యోగార్థులు పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పంటించారు. రహదారులపై, రైలు మార్గాల్లో బైఠాయించారు. ప్రభుత్వ ఆస్తులపై రాళ్ల దాడులకూ పాల్పడ్డారు. బిహార్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 234 రైలు సర్వీసులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది.

నాలుగేళ్ల కాలపరిమితితో తొలిసారిగా కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌' సర్వీస్‌ పథకం కింద తొలిబ్యాచ్‌లో 45 వేల మందిని నియమించనున్నారు. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. నాలుగేళ్ల పరిమితితో కూడిన ఈ సర్వీస్‌లో ఎంపికైన వారికి సాంకేతిక నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కలిగినవారిగా తీర్చిదిద్దనున్నారు. ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశమివ్వనున్నారు.

ఇవీ చూడండి:ఏడు రాష్ట్రాల్లో 'అగ్నిపథ్' మంటలు.. అనేక చోట్ల విధ్వంసకాండ!

దేశమంతా అట్టుడుకుతున్నా.. 'అగ్నిపథ్‌' అమలుకే కేంద్రం నిర్ణయం..

Last Updated : Jun 18, 2022, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details