Agnipath protest in Bihar:వివాదాస్పద అగ్నిపథ్ నియామకాలకు వ్యతిరేకంగా వరుసగా నాలుగోరోజూ బిహార్‌లో ఆందోళనలు కొనసాగాయి. ఇవాళ బిహార్ బంద్‌కు పిలుపునిచ్చిన నిరసనకారులు... రైల్వే స్టేషన్ల ఎదుట ఆందోళనలకు దిగారు. పలుచోట్ల పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. పట్నా జిల్లాలోని మసౌర్హి సబ్-డివిజన్‌లోని తారేగానా రైల్వే స్టేషన్‌కు నిరసనకారులు నిప్పు పెట్టారు. రైల్వే పోలీసులకు చెందిన వాహనాన్ని దగ్ధం చేయగా... పరిస్థితి అదుపు తప్పడంతో జీఆర్పీ సిబ్బంది కాల్పులు జరిపారు.
ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా 32 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ నెల 20 వరకూ ఉదయం 4 నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఎలాంటి రైళ్లు నడవబోవని స్పష్టం చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమై... ఉదయం 4 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు వివరించింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఆందోళనలతో.. బిహార్‌లో ఇప్పటివరకూ 60కి పైగా రైలు బోగీలు, 10 ఇంజన్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ముంగేర్‌లో నిరసనకారులు రోడ్లపై టైర్లు కాల్చి రాకపోకలు అడ్డుకున్నారు. ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించకుండా నిరోధించిందేందుకు... బిహార్‌లోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.
Agnipath protests UP:ఉత్తరప్రదేశ్‌లోనూ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జన్‌పుర్‌లో నిరసనకారులు ఓ బస్సును తగలబెట్టారు. రోడ్లపై ద్విచక్ర వాహనాలు వేసి దగ్ధం చేశారు.
Agnipath protests Punjab:పంజాబ్‌లోని అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులు... లుథియానా రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారు. లుథియానా రైల్వే స్టేషన్ అద్దాలు ధ్వంసం చేసిన నిరసనకారులు... పట్టాలపై రైల్వే సామాగ్రి వేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్పించారు. ముఖాలకు మాస్క్‌లు ధరించిన 50 మందికి పైగా యువకుల గుంపు... కర్రలు చేతబట్టి రైల్వేస్టేషన్ అద్దాలు, టికెట్ కౌంటర్లు ధ్వంసం చేసింది. గతంలో మాదిరిగానే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.