తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆస్తి ఇవ్వలేదని తండ్రిని బంగాల్​లో వదిలేసి వచ్చిన హైదరాబాదీ!'

కన్న తండ్రిని వేరే రాష్ట్రంలోని గుర్తు తెలియని ప్రాంతంలో వదిలేసి వచ్చాడు ఓ హైదరాబాదీ. ఏమీ ఎరగనట్లు ఉండిపోయాడు. మూడున్నర నెలల క్రితం బంగాల్​, ఖారగ్​పుర్​లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వృద్ధుడి ఆచూకీ ఎలా తెలిసింది?

Telugu person abandoned by son
తండ్రిని బంగాల్​లో వదిలేసి వచ్చిన హైదరాబాదీ

By

Published : Nov 1, 2021, 4:52 PM IST

Updated : Nov 1, 2021, 5:47 PM IST

ఆస్తి ఇవ్వలేదని తండ్రిని బంగాల్​లో వదిలేసి వచ్చిన హైదరాబాదీ

ప్రస్తుత ప్రపంచంలో ప్రేమానురాగాలు, బంధుత్వాలకు చోటు లేకుండా పోయింది. మనుషుల కన్నా డబ్బులనే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులను సైతం మరిపిస్తోంది డబ్బు. ఆస్తి ఇవ్వలేదనే అక్కసుతో కన్న తండ్రిని ఎక్కడున్నామో తెలియని చోట వదిలేసి తన సొంత రాష్ట్రానికి మకాం మార్చాడు ఓ వ్యక్తి.

ఏం జరిగింది?

తెలుగువారైన వి క్రిష్ణారావు(65).. రైల్వే శాఖలో విధులు నిర్వర్తించి కొద్ది నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. భార్య, కొడుకు, కోడలు, మనవళ్లతో బంగాల్​, పశ్చిమ మిద్నాపుర్​ జిల్లాలోని ఖరగ్​పుర్​లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగ విరమణ చేసిన క్రమంలో.. రైల్వే శాఖ నుంచి ఫించన్​ అందుకుంటున్నారు క్రిష్ణారావు. కొంత స్థిరాస్తి సైతం ఉంది. ఈ క్రమంలోనే ఆ ఆస్తిని తన పేరుపైకి మార్చాలని తండ్రిపై ఆయన కుమారుడు విజయ్​ కుమార్​ ఒత్తిడి చేయటం మొదలు పెట్టాడు.

వి క్రిష్ణారావు

ఈ ఏడాడి జులైలో తండ్రిపై దాడి చేశాడు విజయ్​. దాంతో పెద్దాయన తలకు గాయాలయ్యాయి. నగరంలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుని 10 రోజులకు ఇల్లు చేరారు. ఆ తర్వాత.. విజయ్​, అతని కొంత మంది స్నేహితులు బలవంతంగా క్రిష్ణారావును కారులో ఎక్కించుకుని వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడు స్పృహ కోల్పోయారు. తెల్లవారి తేరుకున్నాక చూస్తే.. ఓ రిహబిలిటేషన్​ కేంద్రంలో ఉన్నట్లు గుర్తించారు. తన తండ్రి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి.. అక్కడ చేర్పించినట్లు తెలుసుకున్నారు.

రిహబిలిటేషన్​ సెంటర్​లో క్రిష్ణారావు

మరోవైపు.. విజయ్​ కుమార్​, తన భార్యాపిల్లలతో హైదరాబాద్​కు మకాం మార్చాడు. అదే సమయంలో క్రిష్ణారావు చిన్న తమ్ముడు వి. జగన్​మోహన్​ రావు.. తన అన్న గురించి గాలించడం ప్రారంభించారు. చికిత్స కోసం వెళ్లారేమోనని ముందుగా స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో వెతికారు. కానీ, ఎలాంటి ఆచూకీ లభించలేదు.

అన్నయ్యతో జగన్​మోహన్​ రావు

ఆ తర్వాత క్రిష్ణారావు ఉండే ప్రాంతంలోని వారిని అడిగారు. మూడున్నర నెలల తర్వాత.. పునరావాస కేంద్రంలో ఉన్నారని మాజీ కౌన్సిలర్, టీఎంసీ నేత మురళి​ సాయంతో తెలుసుకోగలిగారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు జగన్​ మోహన్ రావు. పోలీసులు.. విజయ్​కు ఫోన్​ చేయగా తన తండ్రి మానసిక అనారోగ్యానికి గురయ్యారని, అందుకే అక్కడ చేర్పించినట్లు సమాధానమిచ్చాడు.

పోలీసులు, స్థానిక నేతల సాయంతో ఇల్లు చేరారు క్రిష్ణారావు. తన అన్న కుమారుడు ఇలా చేస్తాడని కలలో కూడా ఉహించలేదని తెలిపారు జగన్​ మోహన్​ రావు.

" మా అన్నయ్య కొడుకు అన్యాయంగా, హింస పెట్టి ఒక అడిక్ట్​ సెంటర్​లో చేర్పించి ఈ ఊరు వదిలి పారిపోయాడు. ఆయన గత మూడున్నర నెలలుగా ఇందులో బాధపడుతున్నారు. మా అన్నయ్య ఎక్కడున్నారో ఆయన కుమారుడు ఎవరికీ తెలియనివ్వలేదు​. అందువల్ల మా అన్నయ్యను రక్షించుకోవడానికి మూడున్నర నెలలు సమయం పట్టింది. ఇక్కడ వాళ్లు విడిచిపెట్టేలా లేరు. మా వార్డు మాజీ కౌన్సిలర్​ బి. మురళికి మా పరిస్థితి అంతా వివరించాను. ఆయన పూర్తి సమయాన్ని మాకోసం వెచ్చించి మా అన్నయ్యను, నన్ను కూడా దీని నుంచి విముక్తి చేశారు. "

- వి. జగన్ ​మోహన్​ రావు, క్రిష్ణారావు తమ్ముడు

ఖరగ్​పుర్​లో ఏ తెలుగువాడికి అన్యాయం జరిగినా ఊరుకోబోమని చెప్పారు మాజీ కౌన్సిలర్​ బొంతా మురళి. టీఎంసీ సైనికుడిగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన ధైర్యంతో వారికి అండగా ఉంటామన్నారు.

"ఖరగ్​పుర్​లోని 15వ వార్డులో ఉంటున్నాం. నేను అక్కడ మాజీ కౌన్సిలర్​ను. క్రిష్ణారావు సోదరుడు వచ్చి ఈయన్ను గుర్తించి చెప్పారు. ఇందులోంచి విముక్తి కల్పిస్తానని నమ్మకం కల్పించాను. మీ అన్నయ్యకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు దీదీ సైనికుడు బొంతా మురళి ఎప్పుడు ఉంటాడని చెప్పాను. "

-బొంతా మురళి, ఖరగ్​పుర్​ 15వ వార్డు మాజీ కౌన్సిలర్​

ఇదీ చూడండి:POLICE HUMANITY: దీనస్థితిలో వృద్దుడు... ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Last Updated : Nov 1, 2021, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details