శ్రద్ధా వాకర్‌ను చంపిన అఫ్తాబ్ పూనావాలాను ఉరి తీయాలని ఆమె తండ్రి వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. తన కుమార్తెను దారుణంగా హతమార్చిన వ్యక్తికి.. శిక్ష సైతం అంతే కఠినంగా ఉండాలని అన్నారు. తమకు న్యాయం జరుగుతుందన్న భరోసాను దిల్లీ పోలీసులు కల్పించారని పేర్కొన్నారు. ఈ మేరకు ముంబయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సైతం తమకు అండగా నిలిచారని తెలిపారు.
'అఫ్తాబ్‌ను ఉరి తీయాలి.. కుటుంబ సభ్యులనూ ప్రశ్నించాలి'.. శ్రద్ధ తండ్రి డిమాండ్ - శ్రద్ధా వాకర్ తండ్రి ప్రెస్ కాన్ఫరెన్స్
అఫ్తాబ్ పూనావాలకు మరణ శిక్ష విధించాలని దిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరుగుతుందని దిల్లీ పోలీసులతో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భరోసా ఇచ్చారని తెలిపారు.
"నా కుమార్తెను చంపిన అఫ్తాబ్ పూనావాలాకు అలాంటి శిక్షే విధించాలి. అతడిని ఉరితీయాలి. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఈ ఘటనతో సంబంధం ఉన్నవారందరినీ విచారించాలి. గత రెండేళ్లు నా కుమార్తెతో మాట్లాడేందుకు ప్రయత్నించా. కానీ ఆమె ఎప్పుడూ స్పందించలేదు. చివరిసారిగా శ్రద్ధతో 2021లో మాట్లాడా. బెంగళూరులో ఉంటున్నానని అప్పుడు చెప్పింది. సెప్టెంబర్ 26న అఫ్తాబ్‌కు కాల్ చేసి శ్రద్ధ గురించి ఆరా తీస్తే.. అతడు ఏ సమాచారం ఇవ్వలేదు. అఫ్తాబ్, శ్రద్ధ కలిసి ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. అఫ్తాబ్‌తో ఉన్న సమయంలో శ్రద్ధ ఇబ్బందులు పడిందన్న విషయం నాకు తెలియదు."
-వికాస్ వాకర్, శ్రద్ధా వాకర్ తండ్రి
మహారాష్ట్ర పోలీసులు ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించారని వికాస్ వాకర్ ఆరోపించారు. వసయీ, నల్సాపారా, తులింజ్ ప్రాంత పోలీసులు.. శ్రద్ధా వాకర్ ఇచ్చిన ఫిర్యాదుపై తగిన రీతిలో స్పందించలేదని అన్నారు. 'దిల్లీ పోలీసులు, వసయీ పోలీసుల సంయుక్త విచారణ సంతృప్తికరంగానే సాగుతోంది. కానీ మహారాష్ట్ర పోలీసులు ముందుగా నిర్లక్ష్యం వహించారు. వారు వెంటనే స్పందించి ఉంటే.. నా కుమార్తె జీవించి ఉండేది. వసయీ, నల్సాపారా, తులింజ్ పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలి' అని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు.
డేటింగ్ యాప్‌ల వల్లే శ్రద్ధకు అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడిందన్నారు వికాస్. కొన్ని యాప్‌లపై నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు జరిగిన విషాదం ఇంకెవరికీ జరగకూడదంటూ పేర్కొన్నారు.