ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించటంపై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని మరాఠాలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(జీఏడీ).. జీవో విడుదల చేసింది.
"సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు(ఎస్ఈబీసీ)గా గుర్తించిన మరాఠాలకు 10శాతం ఈడబ్ల్యూఎస్ కోటా వర్తించనుంది. మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించిన 2020 సెప్టెంబర్ 9 నుంచి ఈ ఏడాది మే 5న తుది తీర్పు వెలువరించే సమయంలో ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. స్టే విధించే ముందు పెండింగ్లో ఉన్న ఎస్ఈబీసీ అభ్యర్థుల నియామకాలకు వర్తిస్తుంది. కానీ, నియామకాలు, ప్రవేశాల్లో ఎస్ఈబీసీ కోటా పొందిన వారికి వర్తించదు."
- మహారాష్ట్ర ప్రభుత్వం.