Demolition Drive Himmatnagar: 'బుల్డోజర్' రాజకీయం అన్ని రాష్ట్రాలకూ పాకుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ మొదలుకొని దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు విస్తరించింది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు చెలరేగిన దిల్లీ జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. తాజాగా.. గుజరాత్ హిమ్మత్‌నగర్‌లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు చేపట్టింది అధికార యంత్రాంగం. ఏప్రిల్ ప్రారంభంలో.. శ్రీరామనవమి వేడుకల సమయంలో ఇదే ప్రాంతంలో మతపరమైన అల్లర్లు చెలరేగడం గమనార్హం.
సాబరకాంఠా జిల్లా హిమ్మత్‌నగర్‌లోని ఛపారియాలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏప్రిల్ 10 రామనవమిన ఊరేగింపు సందర్భంగా.. ఛపారియా సమీపంలోనే అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాలకు చెందిన ప్రజలు.. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. చాలా వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి.