నెల క్రితం ముగిసిపోయిందని ప్రకటించిన నాయకత్వ సమస్య ఛత్తీస్‌గఢ్(Chhattisgarh Congress News) అధికార కాంగ్రెస్‌లో తిరిగి మొదలయ్యిందా? ఆ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు బుధవారం దిల్లీకి వెళ్లడం వల్ల 'ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం' మళ్లీ మొదటికి వచ్చిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్(Chhattisgarh CM) స్థానంలో సింగ్‌దేవ్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ ఆగస్టు నెలలో ఇరు వర్గాలు దిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని కలిశాయి. రాహుల్ గాంధీ సర్దిచెప్పి వివాదం ముగిసిందని ప్రకటించారు.
పంజాబ్ కాంగ్రెస్‌లో వివాదం ముదిరిపాకాన పడుతున్న సమయంలో ఛత్తీస్‌గఢ్ వ్యవహారం మళ్లీ తెరమీదకు రావడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇది మరో తలనొప్పి వ్యవహారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దిల్లీకి వచ్చిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన బృహస్పతి సింగ్ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని కలిసేందుకు మాత్రమే దిల్లీ వచ్చామని వెల్లడించారు.