తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ టు కశ్మీర్​.. మోదీ వచ్చాకే కూలుతున్న ప్రభుత్వాలు.. ఇలా ఎన్నో! - Non BJP governments collapse

మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. మంత్రి ఏక్​నాథ్​ శిందే తిరుగుబాటుతో.. ఉద్ధవ్​ ఠాక్రే సర్కార్​ పతనం అంచున నిలిచింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు కుప్పకూలాయి. బిహార్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక సహా ఇలా ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

After Modi became the Prime Minister  So Many Non BJP governments collapsed
After Modi became the Prime Minister So Many Non BJP governments collapsed

By

Published : Jun 22, 2022, 6:53 AM IST

నరేంద్ర మోదీ 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా.. పలు రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు కుప్పకూలాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతుతో చాలా చోట్ల కాషాయపార్టీ అధికారం చేపట్టింది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు చేజిక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా.. భాజపా చక్రం తిప్పి, తానే అధికారం చేపట్టిన సందర్భాలూ లేకపోలేదు. ఏ రాష్ట్రంలో ఏం జరిగిందంటే..

అరుణాచల్‌ప్రదేశ్‌
ఇక్కడ 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను కాంగ్రెస్‌ పార్టీ 42 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు కేవలం 11 స్థానాల్లోనే భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలోనే 2016లో ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా మొత్తం 41 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఫిరాయించి, భాజపా నేతృత్వంలోని ‘నార్త్‌-ఈస్ట్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌’కు చెందిన పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో చేరారు. తర్వాత వారంతా భాజపా తీర్థం పుచ్చుకున్నారు!

బిహార్‌
2015 శాసనసభ ఎన్నికల అనంతరం నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ కూటమిలో చీలికలు తెచ్చేందుకు కాషాయపార్టీ గట్టిగానే కృషి చేసింది. ఫలితంగా 2017లో జేడీ(యూ) కూటమి నుంచి బయటకు వచ్చి, భాజపాతో చేతులు కలిపింది. దీంతో నీతీశ్‌ నేతృత్వంలోనే జేడీ(యూ)-భాజపా సర్కారు ఇక్కడ కొలువుదీరింది.

మధ్యప్రదేశ్‌
2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కమల్‌నాథ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్రులు కలిపి మొత్తం 121 మంది సభ్యుల మద్దతును ఆయన కూడగట్టారు. అయితే, జ్యోతిరాదిత్య సింధియా సహా మొత్తం 26 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు తిరుగుబాటు ప్రకటించారు. దీంతో 2020 మార్చిలో కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలి, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో భాజపా సర్కారు కొలువుదీరింది.

మణిపుర్‌
2017లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 28 చోట్ల విజయం సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. 21 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన భాజపాకు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ నుంచి పిలుపు వచ్చింది. 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతుతో భాజపా నాడు అధికారం చేపట్టింది.

గోవా
ఇక్కడ 2017 ఎన్నికల్లో 40 సీట్లకుగాను కాంగ్రెస్‌ 17 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. భాజపా 13 స్థానాలకే పరిమితమైంది. అయినప్పటికీ, ఇతర పార్టీలకు చెందిన పది మంది సభ్యులు, ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2019లో కాంగ్రెస్‌ నుంచి మరో 15 మంది శాసనసభ్యులు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

కర్ణాటక
2018 ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లభించలేదు. 222 అసెంబ్లీ స్థానాలకు గానూ భాజపాకు అత్యధికంగా 104 సీట్లు, కాంగ్రెస్‌కు 80, జేడీ(ఎస్‌)కు 37 సీట్లు వచ్చాయి. భాజపా నేత యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, విశ్వాస పరీక్షలో నెగ్గలేదు. దీంతో కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. 2019లో కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)ల నుంచి 16 మందిని తమవైపు తిప్పుకొని భాజపా మళ్లీ అధికార పగ్గాలు చేపట్టింది.

ఉత్తరాఖండ్‌
2016 మార్చిలో 9 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో నాడు హరీశ్‌ రావత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు సంక్షోభంలో పడింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని పునఃస్థాపించింది.

జమ్ముకశ్మీర్‌
ఇక్కడ 87 స్థానాలకు 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లభించలేదు. పీడీపీ 28 సీట్లు తెచ్చుకోగా, భాజపా 25 స్థానాలు సాధించింది. పార్టీల మధ్య సయోధ్య కుదరక ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఎట్టకేలకు పీడీపీతో కలిసి అధికారం పంచుకునేందుకు భాజపా ముందుకొచ్చింది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 2018లో కాషాయపార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ముఫ్తీ సర్కారు కుప్పకూలింది.

ఇవీ చూడండి:అప్పుడు రిక్షావాలా.. ఇప్పుడు 'మహా' కింగ్​ మేకర్​! ఎవరీ శిందే? ఎందుకిలా?

ఏక్​నాథ్ శిందేకు శివసేన షాక్.. 'మోసం' గురించి అసంతృప్త నేత ట్వీట్!

ఉద్ధవ్​ సర్కార్​కు షాక్​.. మంత్రి తిరుగుబాటు.. 15 మందికిపైగా ఎమ్మెల్యేలతో జంప్​?

ABOUT THE AUTHOR

...view details