తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాత్రిళ్లు హాయిగా నిద్రపోతున్నాం: కశ్మీర్​ ప్రజలు - present situation in Jammu Kashmir news

భారత్‌- పాక్‌ మధ్య కుదిరిన తాజా కాల్పుల విరమణ ఒప్పందంపై జమ్ముకశ్మీర్‌ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నామని చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఒప్పందాన్ని ఇరు సైన్యాలు గతంలోలానే ఉల్లంఘిస్తే మళ్లీ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

After many days we sleep peacefully at night: JK border villagers
రాత్రిళ్లు హాయిగా నిద్రపోతున్నాం

By

Published : Mar 5, 2021, 7:00 AM IST

ఎప్పుడు ఏ క్షిపణి దూసుకొస్తుందో.. ఏ తూటా ఎవరి ప్రాణం తీస్తుందో.. తెలియక బిక్కుబిక్కుమంటూ బతికిన జమ్ముకశ్మీర్‌ సరిహద్దు గ్రామాల ప్రజలు.. భారత్‌-పాక్‌ మధ్య కుదిరిన తాజా కాల్పుల విరమణ ఒప్పందంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అదే సమయంలో ఒప్పందాన్ని ఇరు సైన్యాలు గతంలోలానే ఉల్లంఘిస్తే మళ్లీ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. గత నెల 25న నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేయాలని భారత్‌-పాక్‌ అంగీకరించాయి.

"చాలా రోజుల తర్వాత రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోతున్నాం" అని బారాముల్లాలోని సరిహద్దు ప్రాంతంలోని సరాయ్‌ బండి గ్రామానికి చెందిన కరాముత్‌ హుస్సేన్‌ తెలిపారు. గతేడాది నవంబర్‌ 13న సరిహద్దు ఆవల నుంచి పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఈ గ్రామంలోని 13 మంది చనిపోయారు. ఇందులో కరాముత్‌ కుమారుడు ఇర్షాద్‌ అహ్మద్‌ కూడా ఉన్నారు. "కాల్పుల విరమణతో సాధారణ జీవితం గడిపే అవకాశం దక్కుతుంది. ఎలాంటి భయం లేకుండా మా పిల్లలు తిరిగి పాఠశాలలకు వెళ్లొచ్చు. మాకు శాంతి కావాలి.. రెండు దేశాలు మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం" అని అదే గ్రామానికి చెందిన మునీర్‌ తెలిపారు. పాకిస్థాన్‌ కాల్పుల్లో మునీర్‌(43) సోదరుడు నాదర్‌ హుస్సేన్‌ (45) రెండు కాళ్లు పోగొట్టుకున్నారు.

నిరంతర కాల్పుల కారణంగా చాలా మంది గ్రామాలు విడిచి వెళ్లిపోయారని.. వారంతా తిరిగి వస్తారన్న ఆశాభావాన్ని సిలికోట్‌ గ్రామానికి చెందిన అహ్మద్‌ షా వ్యక్తం చేశారు. "ఎప్పుడు కాల్పులు జరిగినా.. మా చీకటి జీవితాలకు అదే ఆఖరి రోజుగా భావిస్తాం. చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నాం. ఇప్పటికైనా శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాం" అని షా తెలిపారు.

ఇదీ చూడండి:నేడు స్వీడన్​ ప్రధానితో మోదీ వర్చువల్ భేటీ

ABOUT THE AUTHOR

...view details