నకిలీ పత్రాలు సృష్టించి గ్రామస్థులను వేధిస్తున్నారు నలుగురు వ్యక్తులు. దీనిని అడ్డుకున్న ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపారు. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు వారిలో ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహటిన ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
యువకుడి హత్య.. రాళ్లతో నిందితులను కొట్టి చంపిన గ్రామస్థులు - గఢ్వా న్యూస్
అక్రమాలకు అడ్డుపడుతున్నాడనే కారణంతో ఓ యువకుడిని కాల్చిచంపారు నలుగురు దుండగులు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు వారిలో ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని గఢ్వా జిల్లాలో జరిగింది.
గఢ్వా జిల్లాకేంద్రానికి సమీపంలోని సుఖ్బానా గ్రామంలో కొందరు దుండగులు.. నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని ఖాళీ చేయాలంటూ గ్రామస్థులను వేధించేవారు. ఇది గమనించిన విమల్ సింగ్ అనే యువకుడు వారు చేస్తున్న అరాచకాలను అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే విమల్‌ను చంపేస్తామంటూ నిందితులు బెదిరించారు. బుధవారం రాత్రి గ్రామ సమీపంలో ఉన్న కాలువ వద్ద నిల్చున్న విమల్‌ను శ్యామ్‌రాజ్, సంతోశ్ చంద్రవంశీ, కృష్ణ పాశ్వాన్, భిక్షు పాశ్వాన్లు వచ్చి తుపాకీతో కాల్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల రాంచీ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగపడ్డారు. వీరిలో సంతోశ్ చంద్రవంశీ, కృష్ణ పాశ్వాన్లు గ్రామస్థులకు దొరికిపోయారు. కొపోద్రిక్తులైన గ్రామస్థులు వారిని రాళ్లతో కొట్టి చంపారు.
ఇదీ చదవండి:బాలుడిని కాటేసిన విషసర్పం.. క్షణాల్లోనే ఆ పాము మృతి!