అడవిలో పులియబెట్టిన సారా తాగిన ఏనుగుల మంద ఆ మత్తులో తూలుతూ అలాగే నిద్రించిన ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగింది. సారా కోసం పానీయాన్ని సిద్ధం చేసేందుకు వచ్చిన గ్రామస్థులు ఏనుగులను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా.. గజరాజులు ఎంతకీ లేవలేదు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిచారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎట్టకేలకు వాటికి అడవిలోకి పంపించారు.
ఒడిశా అడవుల్లో దొరికే 'మహువా' అనే ఓ అరుదైన పువ్వును పులియబెడితే వచ్చే రసాయనంతో నాటుసారా తయారు చేస్తారు. ఈ క్రమంలో శిలిపాడలోని గ్రామ ప్రజలు 'మహూవా' అనే ఈ సాంప్రదాయ మద్యపానీయాన్ని తయారు చేసేందుకు దగ్గర్లో ఉన్న ఓ జీడిపప్పు తోటలో మద్యానికి కావాల్సిన వస్తువులును సేకరించి ఆ పానీయాన్ని పులియబెట్టారు.
అయితే ఆ తోటలో పులియబెట్టిన రసాయనాన్ని ఏదో పానీయం అనుకుని భావించిన ఆ గజరాజు బృందం దాన్ని గటాగటా తాగేశాయి. అలా తాగిన మత్తుతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆ ఏనుగుల మంద అక్కడే నిద్రించాయి. ఈ క్రమంలో గ్రామస్థులు పానీయాన్ని సిద్ధం చేయడానికి తోటకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడున్న కుండలన్నీ పగిలిపోయి ఉన్నాయి. సమీపంలోనే గజరాజులు ఆదమరిచి నిద్రిస్తూ ఉన్నాయి. దీంతో గజరాజులే కుండలను పగులగొట్టి.. ఆ పానీయాన్ని తాగేశాయని గ్రామస్థులు గుర్తించారు.