తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుతిన్ వ్యతిరేకి మిస్సింగ్.. ఒడిశాలో మరో మిస్టరీ.. పోలీసుల రంగప్రవేశంతో.. - ఒడిశాలో రష్యా పర్యటకుల హత్య

ఒడిశాకు వచ్చిన ఓ రష్యా శరణార్థి తప్పిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. ఆయన ఆచూకీని కనుగొన్నారు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు రష్యన్ టూరిస్ట్​లు అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో.. ఈ వ్యక్తి కనిపించకపోవడం కలకలం రేపింది.

russian tourists death
తప్పిపోయిన రష్యన్ టూరిస్ట్

By

Published : Dec 31, 2022, 6:01 PM IST

Updated : Dec 31, 2022, 9:10 PM IST

ఒడిశాలో రష్యన్ల అనుమానాస్పద మృతి కేసులు ఆందోళనకు దారితీస్తున్న తరుణంలో ఆ దేశానికి చెందిన మరో వ్యక్తి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. నెల రోజుల క్రితం భువనేశ్వర్ రైల్వే స్టేషన్​లో కనిపించిన ఓ రష్యన్ శరణార్థి.. తప్పిపోయాడని తొలుత పోలీసులు తెలిపారు. రష్యన్ల మృతి నేపథ్యంలో అతడి కోసం ముమ్మరంగా గాలించి.. తాజాగా పట్టుకున్నారు. తప్పిపోయిన రష్యన్​ శరణార్థిని ఆండ్రూ గ్లాగోలెవ్​గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలోనే అతడిని పట్టుకున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఆయన తమ కస్టడీలో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వీసా గడువు ముగిసిందని చెప్పారు. ప్రస్తుతం డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామని.. సంబంధిత అధికారులు ఆండ్రూ గ్లాగోలెవ్​ భారత్​లో ఉండడానికి అధికారం ఉందా? లేదా? అనేది నిర్ణయిస్తారని పేర్కొన్నారు. మాస్కోకు చెందిన గ్లాగోలెవ్​ 2016 నుంచి భారత్‌లో ఉన్నారని చెప్పారు. ఆండ్రూ.. భారత్​లో ఆశ్రయం కోసం యూనిటైడ్ నేషన్స్​కు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

అంతకుముందు, ఆండ్రూ గ్లాగోలెవ్ కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. ఆయన కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కనిపించకుండా పోయిన వ్యక్తి కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నెల రోజుల క్రితం భువనేశ్వర్​ రైల్వే స్టేషన్​లో కనిపించిన సమయంలో.. ఆయనతో తాము మాట్లాడినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. ఇద్దరు రష్యా టూరిస్టుల మృతి నేపథ్యంలో అతడి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోందని చెప్పారు.

"ఆ వ్యక్తి నెల రోజుల క్రితం ప్లకార్డు పట్టుకొని భువనేశ్వర్ రైల్వే స్టేషన్​లో కనిపించారు. అతడి ఫొటోను ఎవరో ప్రయాణికులు తీశారు. 'నేను శరణార్థుడిని. రష్యా యుద్ధానికి వ్యతిరేకిని. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్​కి వ్యతిరేకిని. నిరాశ్రయుడ్ని. ప్లీజ్ నాకు సహాయం చేయండి' అనే ప్లకార్డును పట్టుకున్నారు. సమాచారం అందుకుని నేను ఆయన వద్దకు వెళ్లాను. అప్పటికే అతను రైల్వే ప్లాట్‌ఫాంపై ప్లకార్డు పట్టుకుని తిరుగుతున్నారు. నేను అతని పాస్‌పోర్ట్, వీసాను తనిఖీ చేశాను. అన్ని సక్రమంగా ఉన్నాయి. అతనికి ఇంగ్లీష్​లో ప్రావీణ్యం లేకపోవడం వల్ల ఇతర వివరాలు సేకరించలేకపోయా."
--జయదేవ్ బిశ్వజిత్​, రైల్వే ఇన్​స్పెక్టర్

కాగా, ఇటీవల ఇద్దరు రష్యన్లు ఒడిశాలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. 65వ జన్మదిన వేడుకల కోసం తన ముగ్గురు మిత్రులతో కలిసి డిసెంబర్ 21న భారత్‌కు వచ్చారు రష్యా చట్టసభ సభ్యుడు పావెల్ ఆంటోవ్​. వీరందరూ ఒడిశా రాయగడలోని ఓ త్రీస్టార్‌ హోటల్‌లో దిగారు. డిసెంబరు 22న ఉదయం పావెల్ మిత్రుడు వ్లాదిమిర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. పోస్టుమార్టం నివేదికలో ఆయన గుండెపోటు కారణంగా ప్రాణం కోల్పోయినట్లు తేలింది. మిత్రుడి మృతితో కుంగుబాటుకు లోనైన పావెల్‌.. ఈనెల 24న హోటల్ మూడో అంతస్తు నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యన్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా నేర విభాగానికి చెందిన 12మంది సభ్యుల బృందం.. రష్యన్లు బసచేసిన హోటల్‌ గదులను పరిశీలించింది. ఫోరెన్సిక్ నిపుణులు.. చనిపోవడానికి ముందు వారు వాడిన వస్తువులపై వేలిముద్రలను సేకరించారు. ఘటనాస్థలంలో మిగిలిన ఆహారం నమూనాలను పరీక్షలకు పంపించారు. రష్యా చట్టసభ సభ్యుడు పావెల్ ఆంటోవ్ మృతి చెందిన ప్రదేశంలో స్పాట్‌ మ్యాప్‌ను గీశారు.

Last Updated : Dec 31, 2022, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details