జూన్ 10న భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనా దేశస్థుడైన హాన్ జున్వేను జాతీయ భద్రత దళాలు పట్టుకున్నాయి. అతని నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి. అయితే.. ఇప్పటికీ వాటి పాస్‌వర్డ్‌లను ఛేదించడంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), బంగాల్ పోలీసు విభాగంలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్)లు విఫలమవుతూ వస్తున్నాయి. వాటి పాస్‌వర్డ్‌లను తీస్తే జాతీయ భద్రతకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అదే కారణమా..?
చైనా గూఢచారి హాన్ జున్వే.. తన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌లను మాండరిన్(చైనా అధికార భాష)లో భద్రపరిచాడని అందువల్ల వాటిని క్రాక్ చేయటం కష్టతరమవుతోందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. జున్వే పరికరాలను దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని తెలిపాయి.
మనవాళ్లకు ఏదైనా సాధ్యమే..
అయితే ఈ అంశంపై ఎన్ఎస్జీ మాజీ అధికారి దీపాంజన్ చక్రవర్తి 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. గోప్యత కోసమే పాస్వర్డ్ ఛేదించిన విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.