UP politics: మూడు దశాబ్దాల ప్రస్థానం, ఒకసారి అత్యధిక సీట్లతో అధికారం, కేవలం దళిత అనే ముద్రతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన బీఎస్పీ అధినేత్రి మాయవతి మార్కు రాజకీయం ఈ ఎన్నికల్లో ఎక్కడా ఇసుమంత అయినా కనిపించలేదు. సంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా నేడు వెలుబడిన ఫలితాలతో గల్లంతు అయినట్లు స్పష్టమవుతోంది.
గత ఎన్నికల్లో సుమారు 21 శాతం మేర ఉన్న బీఎస్పీ ఓటు షేర్.. ఈ సారి దారుణంగా పడిపోయింది. ఈ ఎన్నికల్లో 12.73 శాతానికి పరిమితం అయ్యింది. 2017 ఎన్నికల్లో 19 సీట్లను గెలుచుకున్న బీఎస్పీ నేడు సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకుంది.
2007లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఎస్పీ.. ఆ సమయంలో 206 సీట్లతో పాటు 30.43 శాతం ఓట్లను పొందింది. అత్యంత బలమైన ఓటు బ్యాంక్‌ను.. అనంతరం జరిగిన పరిణామాలతో మాయావతి కాపాడుకోలేకపోయింది. సంక్షేమ పథకాల ద్వారా అధికార భాజపా తమకు సాయం చేస్తుందని భావించిన సగటు ఓటరు బీఎస్పీని విడిచి భాజపా వైపు అడుగులు వేశాడు. కమలం పార్టీ అంటే పడని మరికొందరు ప్రత్యమ్నాయంగా ఉన్న ఎస్పీని ఎంచుకున్నారు. దీంతో బీఎస్పీకి ఉన్న కోర్ క్యాడర్ పూర్తిగా దెబ్బతింది.
బీఎస్పీలో కీలకంగా ఉన్న నేతలైన ఇంద్రజీత్ సరోజ్, లాల్జీ వర్మ, రామ్ అచల్ రాజ్‌భర్, త్రిభువన్ దత్ వంటి వారు మాయవతి విధానాలు నచ్చక.. ఆ పార్టీని వీడి ఎస్పీలో చేరారు. ఈ చర్యలతో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలు డైలమాలో పడ్డారు. ఈ సమయంలో వారికి ప్రత్యమ్నాయంగా ఉన్న ఎస్పీ, భాజపాకు తరలిపోయారు. ఈ క్రమంలోనే యాదవేతర ఓబీసీలతో పాటు, జాతవ్ వేతర దళితులను హిందుత్వం పేరుతో భాజపా సొంత చేసుకోగలిగిందని విశ్లేషకులు చెప్తున్నారు.