Man Met His Family After 18 Years: గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి.. 18 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. మతిస్తిమితం కోల్పోయిన అతడు కొన్నేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ చేరుకున్నాడు. చాలా ఏళ్లుగా అతడి కోసం కుటుంబ సభ్యులు వెతికారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కొద్దిరోజుల క్రితం.. అతడు గుజరాత్‌కు చెందినవాడిగా గుర్తించారు స్థానికులు. వెంటనే సోషల్ మీడియా ద్వారా అతడి కుటుంబ సభ్యులను సంప్రదించి ఫొటోలను పంపించారు. దీంతో నిర్ధరించుకుని అతడ్ని తన ఇంటికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ జరిగింది.. రాజ్‌కోట్‌కు చెందిన ఓ వ్యక్తి మతిస్తిమితం కోల్పోయి 18 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ చేరుకున్నాడు. అక్కడ సియారామ్ హోటల్ యజమాని అతడిని గుర్తించి.. ఆరా తీశాడు. అతడు ఎటువంటి వివరాలు చెప్పకపోవడం తన హోటల్లో ఆశ్రయం కల్పించాడు ఆ యజమాని. అక్కడే బస ఏర్పాటు చేసి రోజూ భోజనం పెట్టాడు. అతడి పేరు, ఊరు వంటి ఎటువంటి వివరాలు తెలియకపోవడం వల్ల అందరూ అతడ్ని రాజు అని పిలిచేవారు. ఇటీవలే రాజును గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు స్థానికులు. సోషల్ మీడియా ద్వారా రాజు కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఫొటోల ద్వారా నిర్ధరించుకున్నారు. దీంతో బాధితుడు.. తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాజుకు తను తప్పిపోయే ముందే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
18 ఏళ్ల తర్వాత కలుసుకున్నందుకు అతడి భార్యాపిల్లలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చాలా ఏళ్లు ఆచూకీ తెలుసుకునేందుకు కష్టపడ్డామని.. ఎలాంటి ప్రయత్నాలు ఫలించలేదని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పటికైనా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.