దిల్లీ సరిహద్దులో నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా పంజాబ్ జలాలాబాద్కు చెందిన న్యాయవాది అమర్జీత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. టిక్రీ సరిహద్దులో విషం తాగిన ఆయనను రోహ్తక్లోని పీజీ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా తాను చనిపోతున్నట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు న్యాయవాది. రైతుల పరిస్థితి చూసి తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కర్షకుల గోడును కేంద్రం ఇప్పటికైనా వినాలని విజ్ఞప్తి చేశారు. కొత్త చట్టాలు మోసపూరితంగా ఉన్నాయని.. అన్నదాతలు, కార్మికుల్లో అభద్రతాభావం నెలకొందని లేఖలో ఆరోపించారు.