Advani On Ram Mandir :అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధాని మోదీని ఎంచుకొందని బీజేపీ దిగ్గజ నేత L.K అడ్వాణీ అన్నారు. ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక "రాష్ట్ర్ ధర్మ్" ప్రత్యేక సంచికకు ఆయన వ్యాసం రాశారు. రామ మందిర నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా అందులో పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం 33 ఏళ్ల కిందట దేశమంతటా తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. 1990 సెప్టెంబర్ 25 నాటి ఉదయం తాము రథయాత్ర ప్రారంభించినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఓ ఉద్యమంలా మారుతుందని అనుకోలేదని అడ్వాణీ అన్నారు.
ప్రస్తుత ప్రధాని మోదీ ఆ రథయాత్రలో ఆద్యంతం తన వెంట ఉన్నట్టు అడ్వాణీ తెలిపారు. శ్రీరాముడు తన గుడి పునర్నిర్మాణానికి ఆ భక్తుడైన మోదీని ఆనాడే ఎంచుకున్నాడని పేర్కొన్నారు. వ్యాసంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీని కూడా అడ్వాణీ గుర్తు చేసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ఆయన లేని లోటు తెలుస్తోందని చెప్పారు. 'రథయాత్రలోని ఎన్నో అనుభవాలు నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. మారుమూల గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలు రథాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురై మొక్కుతూ రామ నామం తలుచుకునేవారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వారందరి కల. ఇన్నాళ్లు అణిచి పెట్టుకున్న ఆ గ్రామీణుల ఆశలన్నీ జనవరి 22న నెరవేరబోతున్నాయి. ఇందుకు ప్రధాని మోదీని అభినందిస్తున్నా' అని ఆడ్వాణీ తన వ్యాసంలో పేర్కొన్నారు.