తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వివాహేతర సంబంధం నేరం కాదు' తీర్పులో ట్విస్ట్.. సుప్రీం కీలక నిర్ణయం - Supreme Court judgments on Adultery

వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018లో ఇచ్చిన తీర్పుపై స్పష్టత ఇచ్చింది సుప్రీంకోర్టు. వివాహేతర సంబంధం పెట్టుకున్న సైనిక అధికారులపై సాయుధ దళాలు చర్యలు తీసుకోవచ్చని తేల్చిచెప్పింది.

adultery not an offence supreme court
'వివాహేతర సంబంధం నేరం కాదు' తీర్పులో ట్విస్ట్.. సుప్రీం కీలక నిర్ణయం

By

Published : Jan 31, 2023, 4:36 PM IST

Updated : Jan 31, 2023, 6:31 PM IST

వివాహేతర సంబంధం పెట్టుకున్న అధికారులపై సాయుధ దళాలు చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018లో ఇచ్చిన తీర్పుపై మంగళవారం ఈమేరకు స్పష్టత ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్​ 497ను కొట్టివేస్తూ 2018లో జస్టిస్ కేఎం జోసఫ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు, సాయుధ దళాల చట్టంలోని నిబంధనలకు సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జోసెఫ్ షైన్ వర్సెస్​ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ కేఎం జోసఫ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వివాహేతర సంబంధం నేరం కాదన్న తీర్పు.. అలాంటి ఘటనలకు పాల్పడే అధికారులపై చర్యలకు ఆటంకం కలిగిస్తుందని కోర్టుకు నివేదించింది. దళాలకు సంబంధించిన సేవలలో అస్థిరతకు కారణమవుతుందని పేర్కొంది. ఈ తీర్పుతో ఆర్మీ సిబ్బంది ఆందోళనకు గురవుతారని కోర్టుకు తెలిపింది. ఇంటికి దూరంగా ఉంటూ సవాళ్లతో కూడిన పని చేస్తున్న ఆర్మీ సిబ్బందిలో.. కుటుంబం సభ్యులపట్ల అభద్రతా భావం నెలకొంటుందని విన్నవించింది.

కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ హాజరై.. 2018లో జస్టిస్ కేఎం జోసఫ్​ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన వివాహేతర సంబంధం నేరం కాదన్న తీర్పుపై సృష్టత కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్​ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సిటి రవికుమార్‌తో కూడిన ధర్మాసనం.. వివాహేతర సంబంధం పెట్టుకున్న అధికారులపై సాయుధ దళాలు చర్యలు తీసుకోవచ్చని మంగళవారం స్పష్టం చేసింది.

జోసెఫ్ షైన్ వర్సెస్​ యూనియన్ ఆఫ్ ఇండియా..
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 రాజ్యాంగబద్ధతపై జోసెఫ్ షైన్ అనే ఎన్​ఆర్​ఐ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. విచారించిన సుప్రీం కోర్టు.. వ్యభిచారం నేరం కాదని తీర్పునిచ్చింది. దీన్ని నేరంగా పరిగణించే గత తీర్పులన్నింటినీ కోర్టు కొట్టివేసింది.

Last Updated : Jan 31, 2023, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details