Aditya L1 Takes Selfie and Images of Earth :సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య- ఎల్ 1 ఉపగ్రహం గమ్యం దిశగా సాగుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్-1ను పీఎస్‌ఎల్‌వీ-సీ57 వాహక నౌక ద్వారా ఇస్రో నిర్దేశిత భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇప్పటికే పలుమార్లు కక్ష్య పెంపు ప్రక్రియలూ చేపట్టింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనున్న ఆదిత్య-ఎల్1 అనంతరం భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత లంగ్రాజ్-1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మొత్తంగా ఇందుకు నాలుగు నెలలకుపైగా సమయం పట్టనుంది. ఎల్-1 పాయింట్ చేరాక అక్కడ నుంచి ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. ఐతే తన ప్రయాణంలో ఆదిత్య ఎల్-1 సెల్ఫీ తీసుకుంది. అంతేకాదు భూమి, చంద్రుడిని కూడా తనలో ఉన్న కెమెరాలతో క్లిక్ మనిపించింది. ఆ చిత్రాలను ఇస్రో.. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేసింది.
1480.7 కిలోల బరువున్న ఆదిత్య ఎల్-1లో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. సూర్యుడిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే 'పాలపుంత'తో పాటు ఇతర గెలాక్సీల్లోని తారల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సూర్యుడిపై విస్ఫోటాల ద్వారా సౌర వ్యవస్థలోకి అపారమైన శక్తి విడుదల అవుతూ ఉంటుంది. ఇది భూమి వైపు మళ్లితే.. మన సమీప అంతరిక్ష వాతావరణంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడొచ్చు. కాబట్టి.. ఇలాంటి ఘటనలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. అలా జరిగితే దిద్దుబాటు చర్యలకు అవకాశం లభిస్తుందని ఈ ప్రయోగం సందర్భంగా ఇస్రో పేర్కొంది.