Aditya L1 Sun Images :సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో పంపించిన ఆదిత్య-ఎల్1 మరిన్ని అరుదైన చిత్రాలను తీసింది. అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం చేరువ నుంచి సూర్యుడి చిత్రాలను బంధించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇస్రో షేర్ చేసింది. సౌరకుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయిగా అభివర్ణించింది.
ఆదిత్య-ఎల్1లోని సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) పేలోడ్ సూర్యుడి 200 నుంచి 400 నానో మీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలోని చిత్రాలను తీసింది. అందులో ఉన్న శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి సూట్ వీటిని తన కెమెరాల్లో బంధించింది. ఈ ఫుల్-డిస్క్ చిత్రాల ద్వారా సూర్యుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లకు సంబంధించి క్లిష్టమైన వివరాలను తెలుసుకోవచ్చు. అయస్కాంత క్షేత్రం గురించి తెలుసుకోవడంలో ఈ చిత్రాలు కీలక సమాచారాన్ని అందిస్తాయని ఇస్రో తెలిపింది.
సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్ 1 తన ప్రయాణంలో చివరి దశను చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని ఎల్1 పాయింట్‌లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీకి పూర్తవుతాయని కొద్ది రోజుల క్రితం ఇస్రో తెలిపింది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య- ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది.
వచ్చే ఏడాది మరో 10 ప్రయోగాలకు ఇస్రో సిద్ధం!
వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఇస్రో వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇటీవలే వెల్లడించింది. ఇందులో 6 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) మిషన్ ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నట్లు ఆయన తెలిపారు.
రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు 'గగన్‌యాన్' పేరిట భారత్ ప్రతిష్ఠాత్మక మిషన్‌ను చేపడుతుంది. ఇందులో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధరించుకునేందుకు మానవ రహిత మిషన్‌ను చేపట్టాలని ఇస్రో యోచిస్తున్నట్లు జితేందర్ సింగ్ తెలిపారు. దీంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో గగన్‌యాన్ లోని వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా అభివృద్ధి చేసిన 'క్రూ ఎస్కేప్ సిస్టమ్'ను ధ్రువీకరించేందుకు మరో ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
అల్మారాల్లో నోట్ల గుట్టలు- రూ.220కోట్లు సీజ్- ప్రతి పైసా కక్కిస్తామన్న మోదీ
'నాకీ పెళ్లి ఇష్టం లేదు- ఆపేయండి'- తాళి కట్టేముందు చప్పట్లు కొడుతూ షాకిచ్చిన వధువు!