Aditya L1 Mission Update :సూర్యుడి రహస్యాలను చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగంలో.. మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్యను పెంచిన ఇస్త్రో శాస్త్రవేత్తలు.. దానిని సూర్యుడి దిశగా ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్-1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి తాజాగా ఎక్స్(ట్విటర్లో) ఓ పోస్టు చేసింది ఇస్రో. ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.
వాహక నౌక ప్రస్తుతం లగ్రాంజ్ పాయింట్-1 దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను 4 సార్లు పెంచారు. తాజాగా 5వ సారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలోని లంగ్రాజ్ పాయింట్-1 వైపు వెళ్లేలా విన్యాసం చేశారు. 110 రోజుల ప్రయాణం అనంతరం.. ఆదిత్య ఎల్-1ను మరొక విన్యాసంతో లగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు శాస్త్రవేత్తలు.
15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1 వైపుగా ఆదిత్య ఎల్-1 ప్రయాణం..
Aditya l1 Mission ISRO :చంద్రయాన్-3 విజయవంతం తర్వాత సూర్యుడిని పరిశోధించేందుకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం చేపట్టింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. పీఎస్ఎల్వీ సీ-57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు శాస్త్రవేత్తలు. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్ తరఫున సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్ ఇదే కావడం విశేషం. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది ఆదిత్య ఎల్-1.