Aditya L1 Mission Success :సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం అయింది. నిర్దేశించిన లగ్రాంజ్ పాయింట్‌లోని హాలో కక్ష్యకు వ్యోమనౌక చేరినట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. భారత్ మరో మైలురాయిని దాటిందని భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 గమ్యస్థానానికి చేరుకుందని ట్వీట్ చేశారు. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను గ్రహించడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనమన్నారు. ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలన్న ఆయన మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుందన్నారు.
లగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూమికి, సూర్యుడికి మధ్య గల దూరంలో ఇది కేవలం ఒకశాతం మాత్రమే. ఆ ప్రదేశంలో ఉంటే సూర్యుడిని ప్రతీ క్షణం పరిశీలించేందుకు వీలవుతుందని ఇస్రో గతంలో తెలిపింది. అక్కడ సూర్యగ్రహణ ప్రభావం ఉండదని పేర్కొంది. ఆదిత్య L1ను పీఎస్‌ఎల్వీ సీ-57 వాహకనౌక ద్వారా గతేడాది సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. పలు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టిన తర్వాత ఆ వ్యోమనౌక సూర్యుడి దిశగా ప్రయాణం కొనసాగించి 4నెలల తర్వాత లగ్రాంజ్ పాయింట్‌కు చేరింది.
ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా భానుడిలో జరిగే మార్పులు, అవి అంతరిక్షంలో చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసే వీలుంటుంది. ఒకవేళ లగ్రాంజ్ పాయింట్లో ఇస్రో ఆదిత్య L1ను విజయవంతంగా ప్రవేశపెట్టకపోతే అది నియంత్రణ కోల్పోయి సూర్యుడి వైపుగా ప్రయాణిస్తూ ఉండేదని ఇస్రో ఛైర్మన్ గతంలో వెల్లడించారు.
ఇందులో 7 పేలోడ్లు ఉన్నాయి. వీటిలోని విద్యుదయస్కాంత, కణ, అయస్కాంతక్షేత్ర డిటెక్టర్ల సాయంతో సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌తో పాటు సూర్యుడి వెలుపలి పొర అయిన కొరోనాను ఆదిత్య L1 అధ్యయనం చేస్తుంది. కొరోనా ఎలా వేడెక్కుతుంది, కరోనల్ మాస్ ఎజక్షన్, అక్కడి ప్లాస్మా ఉష్ణోగ్రత, సాంద్రతల సమాచారాన్ని ఇస్రోకు అందిస్తుంది. సౌర డైనమిక్స్, సన్‌స్పాట్లు, సౌర విస్ఫోటనానికి దారితీసే ప్రక్రియల క్రమాన్ని తెలుసుకుంటుంది. ఈ అధ్యయనాల వల్ల సౌర తుపానులు సంభవించే అవకాశాలను ముందుగానే శాస్త్రవేత్తలు తెలుసుకునే వీలు ఉంటుంది.
సౌర తుపానుల నుంచి అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలను రక్షించేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పేస్ ఉండే శాటిలైట్లు అప్పుడప్పుడు సౌర తుపానుల ప్రభావానికి గురవుతుంటాయి. ఈ సమయాల్లో భూమిపై సమాచార వ్యవస్థ స్తంభించిపోతుంది. అలాంటి ముప్పును నివారించేందుకు ఈ ప్రయోగం కీలకం కానుందని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ చెప్పారు. అంతరిక్షంలో భారత్‌కు 50కిపైగా శాటిలైట్లు ఉన్నాయని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం కమ్యూనికేషన్ వ్యవస్థ మాత్రమే కాకుండా సౌర తుపానుల నుంచి వెలువడే ప్రమాదకరమైన తరంగాలు విద్యుత్ వ్యవస్థకు కూడా ముప్పు కలిగించే అవకాశాలున్నాయి. ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికే ఈ ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో గతంలో ప్రకటించింది.