Aditya L1 Maneuver Mission : సూర్యుడిపై పరిశోధనల కోసం పంపిన ఆదిత్య ఎల్-1నుశనివారం విజయవంతంగా నిర్దేశిత భూ కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. తాజాగా మరో విన్యాసాన్ని చేపట్టింది. ఆదివారం తొలి భూ కక్ష్య పెంపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 245 కిలోమీటర్లు బై 22 వేల 459 కిలోమీటర్ల నూతన కక్ష్యలో ఉన్నట్లు పేర్కొంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం పనితీరు బాగానే ఉందని చెప్పిన ఇస్రో.. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ విన్యాసం జరిగినట్లు ట్వీట్ చేసింది. తదుపరి విన్యాసం సెప్టెంబర్ 5న తెల్లవారుజామున 3 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.
ISRO Aditya L1 Mission Launch Date :'ఆదిత్య-ఎల్1'ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి మోసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశించింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనున్న 'ఆదిత్య-ఎల్1'.. అనంతరం భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఇస్రో తెలిపింది. సూర్యుడిపై పరిశోధనకు 125 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్1 లగ్రాంజ్ బిందువును చేరుకోనుంది.
What Is Aditya L1 Mission :లగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. ఫలితంగా అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేసే వీలు ఉంటుంది. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం ఉంటుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపట్టింది.