Aditya L1 Launch :చంద్రయాన్ 3 విజయంతో ఉత్సాహంగా ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగాన్ని చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1.. విజయవంతమైంది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌకలో నింగిలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదిక నుంచి ఆదిత్య ఉపగ్రహాన్ని పంపించింది.
ఆదిత్య-ఎల్1ను పీఎస్‌ఎల్‌వీ-సి57 రాకెట్.. కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ఇస్రో ప్రకటించింది. రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 విడిపోయినట్లు ISRO ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆదిత్య ఎల్1 కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 ప్రయాణం ప్రారంభమైందని వివరించారు. లెగ్రాంజ్ పాయింట్ దిశగా ఆదిత్య ఎల్1 ప్రయాణిస్తోందని వెల్లడించారు.
Isro Aditya L1 Mission Launch Date :మొదట ఆదిత్య ఎల్-1ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకునేందుకు దీనికి నాలుగు నెలల సమయం పట్టనుంది. లగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేసే వీలుంది. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం ఉంటుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.
Aditya L1 Mission Details : ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్‌లు ఉన్నాయి.