Adipurush Controversy : ఆదిపురుష్ సినిమాపై ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు జరుగుతన్నాయి. వారణాసికి చెందిన కొన్ని సంఘాల నాయకులు.. సినిమా నిర్మాతలపై, నటినటులపై రాజధాని లఖ్‌నవూలోని వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరికొంత మంది మథురలోని ఓ ధియేటర్ ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. సినిమా చిత్రీకరణపై అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. సినిమాలోని కొన్ని డైలాగ్స్ వింటుంటే తన రక్తం మరుగుతోందన్నారు. సినిమాపై నిషేదం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
సినిమాలోని రాముడు, సీత, హనుమంతుడి పాత్రల డైలాగ్‌లు.. రామాయణ సంస్కృతిని నాశనం చేసేవిగా ఉన్నాయని మరో పూజారి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చిత్రీకరణలో విదేశీయుల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఇలాంటి సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ముందు.. సంబంధిత సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకోవాలని ఆయన సూచించారు. వారణాసిలో సినిమాకు వ్యతిరేకంగా పలు సంఘాల నాయకులు ర్యాలీలు సైతం తీశారు. సినిమాను చూడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా సినిమా ప్రదర్శనకు అనుమతినిచ్చిన సెన్సార్ బోర్డ్‌పై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ.. రాజకీయ దురుద్దేశంతో తీసే సినిమాలకు 'పొలిటికల్ క్యారెక్టర్ సర్టిఫికేట్' కూడా తనిఖీ చేయాలన్నారు. సెన్సార్ బోర్డ్ ధృతరాష్ట్రుడిగా మారిందా? ఆయన ప్రశ్నించారు.