Adhir Ranjan Chowdhury on Mamata Banerjee: దేశంలో యూపీఏ కూటమే లేదని, భాజపాకు ప్రత్యామ్నాయం అవసరమని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించటాన్ని తిప్పికొట్టారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి. యూపీఏ అంటే మమతకు తెలియదా? అని ప్రశ్నించారు. యావత్ దేశం 'మమత, మమత' అంటూ నినాదాలు చేయటం ప్రారంభించిందని ఆలోచిస్తున్నారని, కానీ, భారత్ అంటే బంగాల్ కాదని, బంగాల్ ఒక్కటే భారత్ కాదనేది గుర్తుంచుకోవాలన్నారు. గత బంగాల్ ఎన్నికల్లో ఆమె అనుసరించిన వ్యూహాలు మెల్లిగా బయటపడుతున్నాయని విమర్శించారు.
బంగాల్ ఎన్నికల్లో భాజపా, మమత ఆడిన మతపరమైన రాజకీయ ఆట బయటపడిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత. ఎన్ఆర్సీపై తమ వైఖరిని మార్చుని ఎన్నికలకు భాజపా వెళ్లిందని, మమతా బెనర్జీ చెప్పినదానికి అంగీకరించిందన్నారు.
" 'నా గొంతు, మీ గొంతు కలిస్తే మన గొంతుక అవుతుంది' అనేది భాజపాను సంతోషంగా ఉంచేందుకు మమతా బెనర్జీ అనుసరిస్తున్న తీరు. యూపీఏ ప్రభుత్వంలో టీఎంసీ నుంచి ఆరుగురు మంత్రులు ఉన్నారు. 2012లో యూపీఏకు మద్దతు ఉపసంహరించుకునేందుకు కొన్ని సాకులు చెప్పారు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వాన్ని చీల్చాలనుకున్నారు. ఇతర పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు మమత సఫలం కాలేకపోయారు. అప్పటి కుట్రే కొనసాగుతోంది. మోదీ మద్దతుతో ఈరోజు ఆమె బలం పెరిగింది. అందుకే కాంగ్రెస్ను బలహీనపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. "